వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయ సమీపంలో ఉన్న ఓ చీరల దుకాణం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంటోంది. అందుకు కారణం అక్కడ అమ్మే చీరలు కాదు, ఆ షాపులో కస్టమర్లలాగే ఆదరణ పొందుతున్న వీధికుక్కలు. ఈ అపురూప దృశ్యాన్ని ఓ ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ వీడియో తీయడంతో, ఆ దుకాణం యజమాని పెద్ద మనసు ప్రపంచానికి తెలిసింది.

దేవేష్ అగర్వాల్ అనే ట్రావెల్ వ్లాగర్ కాశీ వీధుల్లో తిరుగుతుండగా ఈ దృశ్యం కంటపడింది. ఓ చీరల దుకాణంలో కొన్ని వీధికుక్కలు ఏ ఆటంకం లేకుండా, యజమాని ఒడిలో ఉన్నట్టుగా హాయిగా నిద్రపోతున్నాయి. వాటిని ఎవరూ వెళ్లగొట్టడం గానీ, ఇబ్బంది పెట్టడం గానీ చేయకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు.

వెంటనే దుకాణం యజమాని జొరావర్ సింగ్‌ను కలిసి “కస్టమర్లు వచ్చినప్పుడు వీటిని బయటకు పంపించరా?” అని దేవేష్ ప్రశ్నించాడు. దానికి ఆ యజమాని “లేదు, రావాలనుకున్న వాళ్లు ఎలాగైనా వస్తారు కదా” అని సమాధానమిచ్చాడు. కుక్కలు ఉంటే వ్యాపారం దెబ్బతింటుందని భావించకుండా, మూగజీవాలకు సురక్షితమైన చోటు కల్పించాలన్న ఆయన ఆలోచన అందరినీ కదిలించింది.

దేవేష్ పోస్ట్ చేసిన ఈ వీడియో కొద్దికాలంలోనే 3.6 మిలియన్లకు పైగా (36 లక్షలు) వ్యూస్‌తో వైరల్‌గా మారింది. జొరావర్ సింగ్ నిస్వార్థ సేవకు, ఆయనలోని దయాగుణానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఎలాంటి గొప్పలు చెప్పుకోకుండా, చాలా సాధారణంగా ఆయన చెప్పిన సమాధానం తమను ఎంతగానో ఆకట్టుకుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

నిత్యం రద్దీగా ఉండే కాశీ నగరంలో, జొరావర్ సింగ్ దుకాణం దయ, కరుణకు నిలువుటద్దంగా నిలుస్తోంది. ఆశ్రయం అవసరమైన వారికి తలుపులు తెరిచి ఉంచడమంత చిన్న పనే కొన్నిసార్లు ఎంత పెద్ద మార్పుకు కారణమవుతుందో ఈ సంఘటన నిరూపిస్తోంది.