పిల్లలు టీవీకి అతుక్కుపోయి చదువును నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ఈ తండ్రి అనుసరించిన పద్ధతి ఆసక్తికరంగా ఉంటుంది. టీవీ చూసే అలవాటును తగ్గించేందుకు చైనాలోని షెన్‌జెన్‌కు చెందిన ఓ వ్యక్తి కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో వినూత్న విధానాన్ని రూపొందించాడు. ఇకపై తన కొడుకు టీవీలో కార్యక్రమాలు చూడాలంటే ప్రతి పది నిమిషాలకోసారి పాఠాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే!

ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసే ఆ వ్యక్తి కుమారుడు జూనియర్‌ సెకండరీ పాఠశాలలో చదువుతున్నాడు. చదువుపై దృష్టి పెట్టకుండా ఎక్కువ సమయం టీవీ చూస్తుండటంతో తండ్రి ఆందోళన చెందాడు. మొదట టీవీలోనే అందుబాటులో ఉన్న ప్రశ్నలు-సమాధానాల ఫీచర్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నించాడు. అయితే బాలుడు దాన్ని తప్పించుకునే మార్గం కనుగొన్నాడు. ఆ తర్వాత నిర్ణీత సమయానికి టీవీని ఆపేసేలా స్మార్ట్‌ ప్లగ్‌ అమర్చినా.. దాన్ని విద్యుత్‌ కనెక్షన్‌ నుంచి తొలగించడంతో ఆ ప్రయత్నమూ విఫలమైంది.

దీంతో గత అక్టోబర్‌లో ఏఐ యాప్‌ సాయం తీసుకున్నాడు. టీవీ చూస్తున్నప్పుడు మధ్యలో ప్రశ్నలు అడిగేలా ‘క్వశ్చన్‌ ఆన్సరింగ్‌ కీ’ అనే ప్రోగ్రామ్‌ను రూపొందించాలని యాప్‌ సూచించింది. ఏఐ సాయంతో దాన్ని తయారు చేసి, అవసరమైన మార్పులు చేసిన అనంతరం టీవీకి అనుసంధానించాడు.

కొత్త విధానం ప్రకారం.. బాలుడు టీవీలో కార్యక్రమం చూస్తున్నప్పుడు ప్రతి పది నిమిషాలకోసారి తెరపై ఓ ప్రశ్న ప్రత్యక్షమవుతుంది. పాఠశాలలో అతడి చదువు స్థాయికి అనుగుణంగా చైనీస్‌, గణితం, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. సరైన సమాధానం చెబితేనే తిరిగి కార్యక్రమం చూసేందుకు అవకాశం ఉంటుంది. తప్పు సమాధానం ఇస్తే మరో ప్రశ్నకు సమాధానం చెప్పాలి.

ఈ విధానం తన కుమారుడికి నచ్చడం చూసి తండ్రి ఆశ్చర్యపోయాడు. ఇకపై ప్రశ్నల స్థాయిని మరింత పెంచాలని భావిస్తున్నాడు. టీవీ చూడటాన్ని పూర్తిగా ఆపేయించడం తన ఉద్దేశం కాదని, దాన్ని తండ్రీకొడుకుల మధ్య ఓ ఆసక్తికరమైన ఆటగా మార్చాలనుకున్నానని చెప్పాడు. ఈ వ్యవస్థను తప్పించేందుకు కొడుకు కొత్త మార్గాలు వెతికితే, వాటిని సరిచేసేందుకు తాను ప్రయత్నిస్తానని వివరించాడు. ఇలా ఇద్దరికీ నేర్చుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. సవాళ్లను ఎదుర్కొనేందుకు కొడుకు సొంతంగా పరిష్కారాలు కనుగొంటే సంతోషిస్తానని తెలిపాడు.