- సాక్షి కథనంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం
- పెళ్లి పిలుపునకు రాజకీయాలు ఆపాదించడంపై అసంతృప్తి
- గతంలో వైఎస్సార్ సైతం చంద్రబాబును ఆహ్వానించారని వెల్లడి
- వైసీపీ తీరుపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు
- పత్రికా కథనానికి జగన్ సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేయడంపై సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, సంబంధిత కథనం ద్వారా తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మండిపడ్డారు.
"తండ్రి వయసున్న వ్యక్తి చంద్రబాబుకు శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా? ఆత్మీయ సంబంధాలు అంటగడతారా? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా? నాపై నేడు సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది వైసీపీ అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ఠ. జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే.. సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు? నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలువెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది. ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబుగారిని వైఎస్సార్ గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొనితిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే వైఎస్సార్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ? వైసీపీ అధ్యక్షుడు జగన్ గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నిందలు వేయడమా మీ పత్రిక విధానం? తల్లి, చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాయించడమేనా మీ ఎజెండా? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా? సమాధానం చెప్పాలి. ఇలాంటి నీచపు రాతలు రాయించినందుకు, తప్పుడు కూతలు కూయించినందుకు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి" అని షర్మిల నిప్పులు చెరిగారు.