దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ఆటోమొబైల్, బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్ల మద్దతుతో ప్రధాన సూచీలు ఒక శాతానికి పైగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 989.94 పాయింట్లు (1.21 శాతం) ఎగబాకి 83,021.75 వద్ద ముగిసింది. నిఫ్టీ 286.35 పాయింట్లు (1.14 శాతం) లాభపడి తిరిగి 25,514.30 స్థాయిని చేరుకుంది.

ఆటో రంగ షేర్లు మార్కెట్ ర్యాలీకి ప్రధాన చోదక శక్తిగా నిలిచాయి. నిఫ్టీ ఆటో సూచీ ట్రేడింగ్ సెషన్‌లో ఏకంగా 4 శాతానికి పైగా పెరిగి ట్రెండ్‌ను నడిపించింది. మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు భారీ లాభాలతో ముందువరుసలో నిలిచాయి. 

అటు బ్యాంకింగ్ రంగం సైతం సరికొత్త చరిత్ర సృష్టించింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ జీవితకాల గరిష్ఠ స్థాయి 63,053.25ను తాకి సరికొత్త రికార్డు నమోదు చేసింది. పీఎస్‌యూ బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లలోనూ కొనుగోళ్ల జోరు కనిపించింది.

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) నిరంతర పెట్టుబడులు, అంతర్జాతీయంగా తగ్గుముఖం పట్టిన ముడిచమురు, రాగి ధరలు భారత మార్కెట్లకు బలమైన మద్దతుగా నిలిచాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల ఆందోళనలతో ఐటీ రంగం కాస్త ఒత్తిడికి లోనైనప్పటికీ, దేశీయ డిమాండ్‌తో ముడిపడి ఉన్న రంగాలపై మదుపర్లు ఆసక్తి చూపించారు. 

సాంకేతికంగా నిఫ్టీ 25,500 స్థాయిని దాటి నిలకడగా కొనసాగితే రాబోయే రోజుల్లో 25,800 నుంచి 26,000 స్థాయలను తాకే అవకాశం ఉందని, కింద వైపు 25,400 స్థాయి తక్షణ మద్దతుగా పనిచేస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.