సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ గురువారం తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర సేవల విభాగం డైరెక్టర్ జనరల్ (డీజీ)గా బాధ్యతలు స్వీకరించారు. దీనితో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) డీజీగా కూడా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సజ్జనార్, తనపై వస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. కొంత మంది తమ ఉనికి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తన పేరు వాడితే మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతోనే కొందరు చూస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వారు కచ్చితంగా చట్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. వీటన్నింటికీ సమయమే సమాధానం చెబుతుందని, దీనికోసం తాను రోడ్డెక్కి మాట్లాడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.

తన కెరీర్ గురించి ప్రస్తావిస్తూ... 26 ఏళ్ల సర్వీసులో తనకు ఇప్పటికే 20 సార్లు బదిలీలు అయ్యాయని సజ్జనార్ గుర్తుచేశారు. ప్రభుత్వం ఏ పోస్టింగ్ ఇచ్చినా తన వంతుగా బాధ్యతాయుతంగా, అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన శాఖాపరమైన అంశాలపై సమీక్షించారు. అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర సహాయక చర్యలు, భద్రతా నిబంధనల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.