దేశంలోని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ల చెల్లుబాటు వ్యవధి నిబంధనలను సవరిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధునిక బీఎస్-6 వాహనాలకు వాటి వయసు, కేటగిరీ (రవాణా లేదా ప్రైవేట్) ఆధారంగా పీయూసీ పునరుద్ధరణ గడువును భారీగా పొడిగించింది. ఇందుకు సంబంధించి కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989ను సవరిస్తూ ‘కేంద్ర మోటారు వాహనాల (పదహారవ సవరణ) నిబంధనలు 2026’ పేరుతో అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

కొత్త నిబంధనల ప్రకారం.. సొంత అవసరాలకు ఉపయోగించే ప్రైవేట్ (నాన్-ట్రాన్స్‌పోర్ట్) బీఎస్-6 వాహనాలు రిజిస్ట్రేషన్ అయిన నాటి నుంచి ఆరేళ్ల వరకు వాటి పీయూసీ సర్టిఫికెట్ ఏకంగా మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ఆరేళ్ల వ్యవధిలో రెన్యువల్ చేసుకున్నప్పుడు పీయూసీ సర్టిఫికెట్ మూడేళ్ల కాలపరిమితితో వస్తుంది. ఆరేళ్ల నుంచి పదేళ్ల మధ్య వయసున్న ప్రైవేట్ వాహనాలు ఏడాదికి ఒకసారి, పదేళ్లు పైబడిన వాహనాలు ఆరు నెలలకు ఒకసారి పీయూసీని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఇక కమర్షియల్ (ట్రాన్స్‌పోర్ట్) బీఎస్-6 వాహనాలకు ఆరేళ్ల వయసు వరకు రెండేళ్ల కాలపరిమితిని నిర్ణయించారు. ఆరేళ్ల నుంచి పదేళ్ల లోపు వాహనాలకు ఏడాది, పదేళ్లు దాటిన వాణిజ్య వాహనాలకు ఆరు నెలల గడువు వర్తిస్తుంది.

పాత వాహనాల విషయానికి వస్తే.. బీఎస్-1, బీఎస్-2, బీఎస్-3 ప్రమాణాలు కలిగిన అన్ని వాహనాల పీయూసీ చెల్లుబాటు కేవలం మూడు నెలలు మాత్రమే ఉంటుంది. అలాగే బీఎస్-4 వాహనాలకు ఆరు నెలల గడువు వర్తిస్తుంది. ఈ నిబంధనలు అమల్లోకి రాకముందే తీసుకున్న పాత సర్టిఫికెట్ల గడువు ముగిసిన తర్వాత తొలిసారి రెన్యూవల్ చేసుకునే సమయంలోనే ఈ నూతన కాలపరిమితి అమలవుతుంది. ప్రస్తుతం ఉన్న సర్టిఫికెట్ ముగియడానికి 10 రోజుల ముందు దరఖాస్తు చేసుకుంటే ముగింపు తేదీ నుంచే కొత్త గడువు ప్రారంభమవుతుంది. గడువు దాటిన తర్వాత రెన్యూవల్ చేస్తే దరఖాస్తు చేసిన తేదీ నుంచే తాజా పీయూసీ అమలులోకి వస్తుంది.