షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సుకు పాకిస్థాన్‌ను ఆహ్వానించడంపై దేశీయంగా తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఢిల్లీలోని పురానా ఖిలా వేదికగా నవంబర్ 20 నుంచి 22 వరకు జరగనున్న ‘ఎస్సీఓ సివిలైజేషనల్ డైలాగ్’ సదస్సులో పాల్గొనాలంటూ కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌కు ఆహ్వానం పంపింది. అందుకు ఆ దేశం అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.

గత మే నెలలో ‘ఆపరేషన్ సింధూర్’ సైనిక చర్యల తర్వాత పాకిస్థాన్ మంత్రి స్థాయి ప్రతినిధికి భారత్ ఆహ్వానం పలకడం ఇదే తొలిసారి. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఎస్సీఓ నియమావళి ప్రకారం అన్ని సభ్య దేశాలకూ ఆహ్వానాలు పంపినట్లే పాకిస్థాన్‌కూ పంపినట్లు అక్టోబర్ 28న కేంద్రం ప్రకటించింది. ఈ సదస్సుకు పాకిస్థాన్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ హాజరవుతారని ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఎస్సీఓ వేదిక ద్వారా సాంస్కృతిక అవగాహన, నాగరికతల మధ్య చర్చలను పెంపొందించేందుకు కట్టుబడి ఉన్నామని పాక్ పేర్కొంది.

కేంద్రం నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పహల్గామ్‌లోని బైసరన్‌లో మతం పేరుతో ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఊచకోత కోసిన ఉగ్రదాడి తర్వాత ఇప్పటివరకు ఏం మారిందని పాకిస్థాన్‌కు ఆహ్వానం పంపారంటూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి కేంద్రాన్ని నిలదీశారు. ఎస్సీఓ బహుళపక్ష వేదిక అయినప్పటికీ, భారీ ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పు ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్పందిస్తూ.. పాక్‌ విషయంలో ప్రభుత్వ విధానం ఏనాడూ స్పష్టంగా ఉండదని మండిపడ్డారు. ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో స్పష్టం చేస్తేనే ప్రతిపక్షాలు తమ స్పందనను తెలియజేస్తాయని పేర్కొన్నారు.

మరోవైపు విపక్షాల విమర్శలపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ స్పందించారు. భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడం పాకిస్థాన్ ప్రయోజనాలకే మంచిదని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాక్‌లో ప్రస్తుతం శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. అక్కడి ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్లలోకి చొరబడి పోలీసులు, సైనికులను హతమారుస్తున్నారని తెలిపారు. దీంతో ప్రజలు దేశం విడిచి పారిపోతున్నారని ధ్వజమెత్తారు. సరిహద్దు ఉగ్రవాదం, టెర్రర్ ఫండింగ్‌పై ఎస్సీఓ సభ్యదేశాలన్నీ ద్వంద్వ ప్రమాణాలు వీడి ఉమ్మడిగా పోరాడాలని భారత్ ఎప్పటినుంచో స్పష్టం చేస్తోందని గుర్తుచేశారు.

ఈ సదస్సుపై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. సదస్సుకు పాకిస్థాన్ హాజరవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్, పాక్‌ల సాంస్కృతిక, నాగరికతల వికాసం భిన్నమైనది కాదని, 1947 విభజనకు ముందు సమాంతరంగా సాగినందున ఈ విషయంలో భేదాభిప్రాయాలకు ఆస్కారం ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గత నెలలో ఇస్లామాబాద్‌లో జరిగిన ఎస్సీఓ సన్నాహక సమావేశానికి భారత్ తరఫున సమన్వయకర్త అలోక్ డిమ్రి హాజరయ్యారు.