తిరుమలలో శ్రీవారి భక్తులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. ఎండల తీవ్రత, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గుతుండటంతో ముందస్తుగా నీటి పొదుపు, యాజమాన్య చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు సుమారు 120 రోజుల అవసరాలకు సరిపోతాయని అధికారులు స్పష్టం చేశారు.

తిరుమలలో భక్తుల రద్దీని బట్టి రోజుకు దాదాపు 50 నుంచి 60 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతోంది. ఇందులో సగం నీటిని పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాల నుంచి తీసుకుంటున్నారు. మిగిలిన సగం తిరుపతి సమీపంలోని కల్యాణి డ్యామ్ నుంచి సరఫరా చేస్తున్నారు. గతంలో కురిసిన వర్షాలతో కొంత ఊరట లభించినప్పటికీ, భవిష్యత్ అవసరాల దృష్ట్యా టీటీడీ పొదుపు చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా ప్రైవేటు హోటళ్లు, మఠాలు, వాణిజ్య సముదాయాలకు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. అవసరమైతే ప్రైవేటు హోటళ్లు తిరుపతి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సమకూర్చుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

రాబోయే రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు నిండితే 18 నెలల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోతే, కల్యాణి డ్యామ్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ వనరుల నుంచి నీటిని తీసుకురావాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. జలాశయాల్లో పూడికతీత, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, నీటి లీకేజీల నివారణపై కూడా టీటీడీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.