రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర నగదు రహిత అత్యవసర చికిత్స అందించేందుకు ఉద్దేశించిన ‘పీఎం-రాహత్’ (PM-RAHAT) పథకంలో భాగస్వాములు కావాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రులను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ అధికారికంగా పబ్లిక్ నోటీసు జారీ చేస్తూ, ఆసుపత్రుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మెడికల్ కాలేజీల డైరెక్టర్లు, డీన్లు, ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను కోరింది.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖల సూచనల మేరకు ఎన్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. 2026 ఫిబ్రవరి 13న దేశవ్యాప్తంగా ప్రారంభమైన పీఎం-రాహత్ పథకం కింద అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులకు గరిష్ఠంగా రూ. 1.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన నాటి నుంచి 7 రోజుల పాటు ఈ క్యాష్‌లెస్ సదుపాయం వర్తిస్తుంది. బాధితుల ప్రాణాలను కాపాడేందుకు అత్యంత కీలకమైన 'గోల్డెన్ అవర్'లో వైద్యం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రాణాపాయం లేని కేసుల్లో 24 గంటలు, తీవ్ర గాయాలైన బాధితులకు 48 గంటల వరకు స్టెబిలైజేషన్ చికిత్సను అనుమతిస్తారు.

బాధితులు లేదా ఘటనా స్థలంలో సాయం చేసే వ్యక్తులు '112' ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేసి నిర్దేశిత ఆసుపత్రుల వివరాలు, అంబులెన్స్ సాయం పొందవచ్చు. ఈ పథకంలో చేరే ఆసుపత్రుల్లో 24 గంటల అత్యవసర సేవలు, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, ఎక్స్-రే, సీటీ స్కాన్ లాంటి వసతులతో పాటు ట్రామా, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ వైద్యులు తప్పనిసరిగా ఉండాలని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ (AB PM-JAY) పరిధిలో ఉన్న ఆసుపత్రులకు ఇందులో నేరుగా అర్హత ఉంటుంది. ఇతర ఆసుపత్రులు కూడా నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని ఎన్‌ఎంసీ సూచించింది.