చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన సినిమాలు సంచలన విజయాలను సాధించడం .. రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టడం మలయాళ సినిమాల విషయంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు ఆ తరహా విన్యాసాలను కన్నడ సినిమాలు చేయడం కూడా మనకి కనిపిస్తుంది. అలా వచ్చిన ఒక సినిమానే 'ప్రేమద ఊరలి'. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన మ్యూజికల్ డ్రామా ఇది. మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రంగాయన రఘు .. శ్రీరామ్ .. తపస్విని ప్రధానమైన పాత్రలను పోషించారు. 

ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేసింది. అక్కడి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను గురించే మాట్లాడుకున్నారు. కేవలం 2 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, చాలా తక్కువ సమయంలో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా 150 కోట్ల మార్కును దాటేసింది. అంతేకాదు ఈ ఏడాది ఇంతవరకూ విడుదలై భారీ వసూళ్లను సాధించిన కన్నడ సినిమాలలో రెండో స్థానంలో నిలిచింది.    

బడ్జెట్ పరంగా ఒక చిన్న సినిమా, బలమైన కంటెంట్ ఉంటే ఎలా దూసుకుపోతుందనేది ఈ సినిమా మరోసారి నిరూపించింది. భారీ బడ్జెట్ .. వివిధ భాషలకి చెందిన స్టార్స్ .. పెద్దఎత్తున పబ్లిసిటీ లేకపోయినా ఈ సినిమా తన సత్తా చాటుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'అమెజాన్ ప్రైమ్'లో అడుగుపెట్టింది. కన్నడతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషలలో ఈ రోజు (నవంబర్ 17) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా ఒక రేంజ్ లో ఆకట్టుకునే అవకాశాలైతే ఉన్నాయి.