హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ మురళీధర్ భగవత్, పోలీస్ శాఖలో ప్రక్షాళనకు నడుం బిగించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. శాఖాపరమైన చర్యలతో పాటు, నేరం తీవ్రతను బట్టి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల కొందరు పోలీసు అధికారులు లంచం, బెదిరింపుల కేసుల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అవినీతి, అక్రమ నిర్బంధాలు, భూవివాదాలు వంటి సివిల్ అంశాలలో పోలీసుల జోక్యంపై 'జీరో టాలరెన్స్' విధానాన్ని అనుసరిస్తామని మహేశ్ భగవత్ తెలిపారు. తమ స్పెషల్ బ్రాంచ్ బృందాలు ఇలాంటి కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతాయని చెప్పారు. ఎవరైనా అధికారి తప్పుగా ప్రవర్తిస్తే, బాధితులు నేరుగా జోనల్ హెడ్స్‌కు ఫిర్యాదు చేయవచ్చని, ఆరోపణలు రుజువైతే సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇటీవల అన్ని జోన్ల ఉన్నతాధికారులు, ఎస్‌హెచ్‌‌వోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోలీసులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అవినీతి, అత్యాచారం, బెదిరింపుల ఆరోపణలపై ఏసీబీకి చిక్కిన పోలీసు సిబ్బంది రికార్డులను కూడా ఆయన సమీక్షించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.

పోలీసులు స్టేషన్లకే పరిమితం కాకుండా, తమ పరిధిలోని ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని భగవత్ ఆదేశించారు. ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రి వరకు సున్నితమైన ప్రాంతాల్లో గస్తీని బలోపేతం చేయాలని సూచించారు. ఉదయం పూట గస్తీ పనితీరును సమీక్షించి, ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని పెట్రోలింగ్ పెంచాల్సిన ప్రాంతాలను గుర్తించాలని తెలిపారు.

ఇటీవల కమిషనరేట్ పరిధి శంషాబాద్, రాజేంద్రనగర్ వరకు విస్తరించడంతో బాధ్యతలు కూడా పెరిగాయని, సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని సీపీ పేర్కొన్నారు. వ్యవస్థీకృత నేరాలు, ముఠా కక్షలను నివారించేందుకు త్వరలోనే ‘ప్రిజనర్-రిలీజ్ మానిటరింగ్ మెకానిజం’ను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. విడుదలైన ఖైదీల సమాచారాన్ని T-SPARK, CCTNS వ్యవస్థలతో అనుసంధానం చేసి వారిపై నిఘా ఉంచుతామన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ ప్రక్రియను సులభతరం చేయడంపై కూడా ట్రాఫిక్ అధికారులతో ఆయన చర్చించారు. తనకు ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన భగవత్, అన్ని విభాగాల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని పోలీసింగ్‌ను మరింత మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు.