ఆంధ్రప్రదేశ్‌లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్ ) రంగాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి రూ.5,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, లక్ష ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకుని 'ఏవీజీసీ-ఎక్స్ఆర్ విధానం 2026-31'కి తుదిరూపునిచ్చింది. ఇందులో భాగంగా రాజధాని అమరావతిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 'మీడియా సిటీ'ని, ప్రత్యేక పార్కును అభివృద్ధి చేయనుంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 10న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నూతన విధానానికి ఆమోదముద్ర పడగా, తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. 2026 నుంచి 2031 వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పాలసీ ద్వారా ఐదు యాంకర్ యూనిట్లతో పాటు మరో 100 కంపెనీల నుంచి పెట్టుబడులు రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అమరావతిలోని మీడియా సిటీలో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి బాధ్యతను ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ)కు అప్పగించారు.

ఈ విధానం ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే సంస్థలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఏవీజీసీ-ఎక్స్ఆర్ మౌలిక వసతుల కల్పనకయ్యే ఖర్చులో 50 శాతం రాయితీ (గరిష్ఠంగా రూ.2 కోట్లు), పార్కుల అభివృద్ధికి ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం (గరిష్ఠంగా రూ.50 కోట్లు) సబ్సిడీని ప్రభుత్వం అందించనుంది. వీటితో పాటు ఐదేళ్ల పాటు వంద శాతం రాష్ట్ర జీఎస్టీ వాపసు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పించనుంది. రూ.200 కోట్ల పెట్టుబడితో కనీసం 200 మందికి ఉపాధి కల్పించే సంస్థలను 'మెగా ప్రాజెక్టులు'గా గుర్తించి ప్రత్యేక రాయితీలు అందజేయనున్నారు.

అమరావతిలో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏవీజీసీ-ఎక్స్ఆర్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆమోదం పొందిన రోబోటిక్స్, సెమీకండక్టర్ విధానాలతో పాటు ఈ ఏవీజీసీ-ఎక్స్ఆర్ పాలసీకి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా.. రాష్ట్రంలో సాంకేతిక రంగం, నవకల్పనల అభివృద్ధికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టమవుతోంది.