అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌లో యువ భారత జట్టు అసాధారణ విజయాన్ని నమోదు చేసిన విష‌యం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఓటమి అంచున నిలిచిన జట్టును, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మానల్ చౌహాన్, మోహిత్ ఉల్వాలు గెలుపు తీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత యువ జట్టుపై క్రికెట్ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది.

338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టు ఒక దశలో 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమనిపించింది. గెలుపునకు చివరి 8 ఓవర్లలో 86 పరుగులు అవసరమైన క్లిష్ట పరిస్థితుల్లో మానల్ చౌహాన్, మోహిత్ ఉల్వాలు క్రీజులో నిలిచి అద్భుత పోరాటపటిమ ప్రదర్శించారు. ముఖ్యంగా 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మోహిత్ ఉల్వా, పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 49 పరుగులు చేసి జట్టును విజయాన్ని అందించాడు. చివరి బంతికి 3 పరుగులు అవసరమైనప్పుడు, క్రీజు బయటకు వచ్చి ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా బౌండరీ బాది చిరస్మరణీయ గెలుపును భారత్ ఖాతాలో వేశాడు.

మోహిత్ ఉల్వా ప్రదర్శనపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'సోనీ స్పోర్ట్స్‌'తో గవాస్కర్ మాట్లాడుతూ.. ఉల్వాను భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో పోల్చాడు. "అతను (ఉల్వా) ఎంఎస్ ధోనీలాంటి ప్రశాంతతను చూపించాడు. అతను ఒక ఐస్‌మ్యాన్. క్రీజులోకి రాగానే ఒక ఫోర్ కొట్టి పరిస్థితిని గమనించాడు. హెల్మెట్ తీసి, చేతులు పైకెత్తి సంబరాలు చేసుకున్నాడు. ఆ స‌మ‌యంలో అత‌నిలో ధోనీ క‌నిపించాడు" అని వివరించాడు.

2011 ప్రపంచ కప్ ఫైనల్‌లో ధోనీ సిక్సర్ కొట్టి గెలిపించిన తీరును ఈ ముగింపు గుర్తు చేసిందని గవాస్కర్ అన్నాడు. "ఒకవేళ ధోనీ అక్కడ ఉన్నా, అలాగే చేసి ఉండేవాడు. ప్రపంచకప్‌లో సిక్సర్ కొట్టాక ధోనీ తన బ్యాట్‌ను ఎలా పైకెత్తాడో మనం చూశాం. అది ఎంత గుర్తుండిపోతుందో, ఇది కూడా అంతే" అని కొనియాడాడు. 

"అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, వారు ఎప్పుడూ ఓటమిని అంగీకరించలేదు. ఎనిమిదో వికెట్ పడే సమయానికి 80 పరుగులకు పైగా అవసరం ఉన్నా, తమ లక్ష్యాన్ని మర్చిపోలేదు" అని వారి పోరాట స్ఫూర్తిని స‌న్నీ మెచ్చుకున్నాడు.