ఆంధ్రప్రదేశ్ అంతరిక్ష రంగంలో కేంద్రంగా మారేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. భారత అంతరిక్ష ప్రయోగాలకు చిరునామాగా ఉన్న శ్రీహరికోట సమీపంలో భారీ ‘స్పేస్ సిటీ’ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, రాష్ట్రాన్ని స్పేస్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రణాళికలో భాగంగా, ఇటీవల విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాకెట్ ఇంజన్ల తయారీ, ప్రొపల్షన్ సిస్టమ్స్, పరీక్ష కేంద్రాల ఏర్పాటు వంటి రంగాల్లో పలు ప్రైవేట్ అంతరిక్ష సంస్థలతో రూ.1,800 కోట్ల విలువైన ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, హాథోర్ రాకెట్స్ వంటి అంకుర సంస్థలు రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి.

గతంలో ఈ స్పేస్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అయితే, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి, పెట్టుబడులను ఆకర్షించడంలో చొరవ చూపుతోంది. కర్ణాటకలో భూమి లభించక ఇబ్బంది పడుతున్న ‘పిక్సెల్’ వంటి స్టార్టప్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా ఆహ్వానించి, రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుకు భరోసా ఇవ్వడం ఇందుకు నిదర్శనం.


శ్రీసత్యసాయి జిల్లా తిమ్మసముద్రంలో 339 ఎకరాల్లో రూ.800 కోట్ల పెట్టుబడితో రాకెట్ ఇంజన్ల పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్ నిర్ణయించింది. దీని ద్వారా 500 మందికి ఉపాధి లభించనుంది. ఇదే జిల్లా  లేపాక్షిలో బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ సంస్థ 120 ఎకరాల్లో రూ.550 కోట్లతో ఉపగ్రహాలు, ప్రొపల్షన్ పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పనుంది. దీని ద్వారా 565 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. తిరుపతి స్పేస్ సిటీలో ‘అగ్నికుల్ కాస్మోస్’ రూ.510 కోట్లతో పునర్వినియోగ రాకెట్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. స్కైరూట్ ఏరోస్పేస్ కూడా ఇక్కడే  రూ.400 కోట్లతో రాకెట్ తయారీ, అసెంబ్లింగ్ యూనిట్‌ను స్థాపించనుంది. తిరుపతి జిల్లా రౌతుసురమాల వద్ద రూ.250 కోట్లతో లిక్విడ్ రాకెట్ ఇంజన్ల తయారీ కేంద్రాన్ని నిర్మించాలని హాథోర్ రాకెట్స్ సంకల్పించింది. ఇది 200 మందికి ఉపాధి కల్పిస్తుంది.

ఈ పరిశ్రమల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ కీర్తిప్రతిష్ఠలు పెరగడమే కాకుండా, వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.