భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) దేశవ్యాప్తంగా పలు ఆర్థిక సంస్థలపై కఠిన చర్యలు చేపట్టింది. మొత్తం 49 నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. వీటితో పాటు మరో 13 ఎన్‌బీఎఫ్‌సీలు, ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ స్వచ్ఛందంగా తమ లైసెన్సులను ఉపసంహరించుకోగా, వాటిని కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది. దీనితో మొత్తం 63 సంస్థలు తమ ఆర్థిక కార్యకలాపాలను నిలిపివేయాల్సి ఉంటుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్షన్ 45-IA (6) ప్రకారం ఈ 49 ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 29 మధ్య ఈ రద్దు ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించింది. ఈ నిర్ణయంతో సదరు కంపెనీలు ఇకపై నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలుగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.

లైసెన్సులు సరెండర్ చేసిన సంస్థల్లో కొన్ని వ్యాపారం నుంచి వైదొలగగా, మరికొన్ని విలీనం లేదా రద్దు కారణంగా తమ చట్టపరమైన అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవడంతో మరికొన్ని సంస్థల లైసెన్సులను రద్దు చేశారు.

లైసెన్సులు కోల్పోయిన వాటిలో మనీష్ సింథటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమర్ ప్లాజా అండ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మణిభావనం హోమ్ ఫైనాన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి.

రిజిస్ట్రేషన్ రద్దయిన ఎన్‌బీఎఫ్‌సీలలో అధిక శాతం పశ్చిమ బెంగాల్‌లో రిజిస్టర్డ్ కార్యాలయాలు కలిగి ఉన్నట్లు ఆర్బీఐ విడుదల చేసిన జాబితా వెల్లడించింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో నిరంతర నియంత్రణ, పర్యవేక్షణలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర బ్యాంక్ స్పష్టం చేసింది.