ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన ఆత్మకథలో తీవ్ర ఆరోపణలు చేశారు. గాజా యుద్ధ సమయంలో పౌరుల ప్రాణనష్టాన్ని తగ్గిస్తామని నెతన్యాహు పదేపదే హామీ ఇచ్చి మాట తప్పారని బైడెన్ విమర్శించారు. ఇజ్రాయెల్ దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే, తన స్వల్పకాలిక రాజకీయ అవసరాలకే నెతన్యాహు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన దుయ్యబట్టారు.

నవంబర్ 17న విడుదల కానున్న తన ఆత్మకథ 'ప్రామిస్ మీ, అమెరికా'లో బైడెన్ ఈ విషయాలను వెల్లడించారు. ఈ పుస్తకంలోని కొన్ని కీలక భాగాలను సీఎన్ఎన్ ప్రచురించింది. అక్టోబర్ 7, 2023న హమాస్ దాడుల తర్వాత ప్రారంభమైన గాజా యుద్ధంలో, పౌరుల ప్రాణనష్టాన్ని తగ్గించాలని తాను నెతన్యాహును పలుమార్లు కోరినట్లు బైడెన్ తెలిపారు. "పౌర మరణాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చేవారు. కానీ ఆ తర్వాత మరింత మంది పౌరులు ప్రాణాలు కోల్పోయేలా దాడులు జరిగేవి. నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వడంలో నెతన్యాహుకు ఎలాంటి సంకోచం లేదు," అని బైడెన్ తన పుస్తకంలో రాశారు.

హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్‌కు అండగా నిలిచినందుకు తాను ఎన్నటికీ చింతించనని బైడెన్ స్పష్టం చేశారు. అయితే, ఆ యుద్ధంలో అపారమైన సంఖ్యలో అమాయక పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఒక రాజనీతిజ్ఞుడిలా ఆలోచించడంలో నెతన్యాహు విఫలమయ్యారని, ఆయన తీరు కొన్నిసార్లు డొనాల్డ్ ట్రంప్‌ను గుర్తుకు తెచ్చేదని బైడెన్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఆరోపణలపై నెతన్యాహు కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.