భారతీయ రైల్వేలో తీవ్ర భద్రతా వైఫల్యం ఒకటి వెలుగుచూసింది. బోగీలకు సంబంధించిన బ్రేకులు ఏమాత్రం పనిచేయని స్థితిలో ఒక వందేభారత్ రైలు ఏకంగా 463 కిలోమీటర్ల మేర పట్టాలపై ప్రయాణించింది. లోకోపైలట్లు పదేపదే హెచ్చరించినప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించి రైలును ముందుకు పంపించడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై సౌత్ ఈస్టర్న్ రైల్వే (ఎస్ఈఆర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

అక్టోబర్ 24న ఝార్ఖండ్‌లోని హాతియా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి ఖాళీగా ఉన్న వందేభారత్ చైర్ కార్ రేక్‌ను ఒక గూడ్స్ ఇంజిన్ సాయంతో తరలించే ప్రక్రియ చేపట్టారు. నిబంధనల ప్రకారం కోచ్‌ల బ్రేకింగ్ వ్యవస్థను ఇంజిన్‌తో సరిగ్గా అనుసంధానించాల్సి ఉండగా, సిబ్బంది ఆ విషయాన్ని నిర్ధారించడంలో పూర్తిగా విఫలమయ్యారు.

హాతియా నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే లోకోపైలట్ సాధారణ తనిఖీల్లో భాగంగా బ్రేక్ టెస్ట్ నిర్వహించారు. ఆ సమయంలో బ్రేకింగ్ సామర్థ్యం అత్యంత పేలవంగా, అసలు పనిచేయనట్లుగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తించారు. రైలు రాంచీ స్టేషన్‌కు చేరుకోగానే సెక్షన్ కంట్రోలర్, ట్రాక్షన్ లోకో కంట్రోలర్‌కు లోకోపైలట్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే, ఆ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని అధికారులు రైలును ముందుకు సాగేందుకు అనుమతించారు.

ఆ తర్వాత మురీ స్టేషన్‌లో విధుల్లోకి వచ్చిన రెండో లోకోపైలట్ కూడా ఇదే సమస్యను గుర్తించారు. బ్రేక్ పైప్ ప్రెషర్ తగ్గించినా బోగీల బ్రేకులు పడటం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ అధికారులు ఆ హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టారు.

చివరకు ఉత్తరప్రదేశ్‌ చందౌలీ జిల్లాలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ (డీడీయూ) స్టేషన్‌కు చేరుకున్న తర్వాతే సాంకేతిక సిబ్బంది ఈ సమస్యపై దృష్టి సారించారు. అక్కడ రైలును పరిశీలించగా విస్తుపోయే నిజం బయటపడింది. రైలులోని అన్ని కోచ్‌ల బ్రేకింగ్ వ్యవస్థలు ఐసోలేట్ అయిపోయాయని, అంటే బోగీల బ్రేకులు పూర్తిగా డిస్‌కనెక్ట్ అయి ఉన్నాయని తేలింది. దీంతో హాతియా నుంచి డీడీయూ వరకు దాదాపు 463 కిలోమీటర్ల మేర ఆ రైలు కేవలం ఇంజిన్ బ్రేకులు, రీజనరేటివ్ బ్రేకింగ్ ఆధారంగానే ప్రయాణించిందని స్పష్టమైంది.

తగినంత బ్రేక్ పవర్ లేకుండా ఒక రైలు ఇంత సుదీర్ఘ దూరం ప్రయాణించడం తీవ్రమైన భద్రతా లోపమని, ఇది ఆ మార్గంలో వెళ్లే ఇతర రైళ్లకు పెను ముప్పుగా మారడమే కాకుండా భారీ ప్రమాదానికి దారితీసేదని సౌత్ ఈస్టర్న్ రైల్వే పేర్కొంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి కోచ్ మెయింటెనెన్స్ సిబ్బంది, సెక్షన్ మరియు ట్రాక్షన్ కంట్రోలర్లు, ఇతర రైలు సిబ్బంది బాధ్యతను నిర్ధారించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాంచీ డీఆర్‌ఎంను ఆదేశిస్తూ నవంబర్ 7న ఉత్తర్వులు జారీ చేసింది.