పంజాబ్‌లో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తరన్‌ తారన్ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న రెండు ప్రభుత్వ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.

తరన్‌ తారన్‌లోని నౌషెహ్రా పన్నువాన్ సమీపంలో జాతీయ రహదారి-54పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫరీద్‌కోట్ నుంచి అమృత్‌సర్ వెళ్తున్న ఒక బస్సు, అకస్మాత్తుగా రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఇదే సమయంలో ఎదురుగా అమృత్‌సర్ నుంచి ముక్త్‌సర్ వస్తున్న మరో బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు బస్సుల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.

ఈ ఘటనపై తరన్‌ తారన్ ఎస్ఎస్పీ సురేంద్ర లంబా స్పందిస్తూ.. నలుగురు యాత్రికులతో పాటు ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న మహిళ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం తరన్‌ తారన్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు.

ప్రమాదానికి గురైన రెండు బస్సులు పంజాబ్ ప్రభుత్వ 'ముఖ్యమంత్రి తీర్థ యాత్ర' పథకంలో భాగంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా 50 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం ఉచితంగా పుణ్యక్షేత్రాల దర్శన సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో కలిపి సుమారు 37 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.