ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకున్న అనుబంధం గురించి, ఇటీవల మెట్రో ప్రయాణంలో జరిగిన ఓ సరదా సంభాషణ గురించి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నవంబర్ 13న పింక్ లైన్ మెట్రో ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానితో కలిసి ప్రయాణించినప్పుడు, తన దగ్గర టికెట్ కొనడానికి డబ్బులు లేవని, తన టికెట్ కూడా కొనమని ప్రధానిని కోరానని ఆయన తెలిపారు. 

"మెట్రో టికెట్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవని నేను ఆయనతో చెప్పాను. నా టికెట్ కూడా కొనమని అడిగాను. వెంటనే ప్రధాని మోదీ తన సొంత కార్డు ఉపయోగించి టికెట్లు కొన్నారు" అని శివకుమార్ నవ్వుతూ చెప్పారు. ప్రధానితో హెలికాఫ్టర్‌లో మైసూరు వెళ్లినప్పుడు ఏం చర్చించారని మీడియా ప్రశ్నించగా "మేము చర్చించుకున్న ప్రతీ విషయాన్ని బయటపెట్టలేను" అని ఆయన సమాధానమిచ్చారు. బీజేపీ నేతలకు కూడా దొరకని సమయం మీకు మోదీతో దొరుకుతోందన్న ప్రశ్నకు, అది మానవ సంబంధాలు, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. "మా పార్టీ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా నన్ను ప్రేమగా, గౌరవంగా చూస్తారు. అందరితో మంచి సంబంధాలు కొనసాగించాలి" అని ఆయన పేర్కొన్నారు.

స్థానిక వనరులకే ప్రాధాన్యం
ఈ సందర్భంగా మెట్రో అధికారులకు ఇచ్చిన కీలక ఆదేశాల గురించి శివకుమార్ వివరించారు. మెట్రో స్టేషన్ల నిర్మాణంలో ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటకలో లభించే గ్రానైట్, ఇతర రాళ్లను మాత్రమే వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశానని తెలిపారు. "మన రాష్ట్రంలోనే నాణ్యమైన రాళ్లు అందుబాటులో ఉన్నప్పుడు, బయటి నుంచి ఎందుకు తీసుకురావాలి? స్థానిక రాళ్లను వాడితే మన పరిశ్రమలకు చేయూతనిచ్చినట్టు అవుతుంది. కటింగ్ నుంచి ప్రాసెసింగ్ వరకు స్థానికులకు ఉపాధి లభిస్తుంది" అని ఆయన అన్నారు. చామరాజనగర్, తుమకూరు, సిరా, బాదామి, ఇల్కల్ వంటి ప్రాంతాల్లో నాణ్యమైన గ్రానైట్ లభిస్తుందని, మన రాళ్ల నాణ్యతలో ఎలాంటి తేడా లేదని ఆయన స్పష్టం చేశారు.

పిల్లలు మొబైల్ ఫోన్ల వాడకం తగ్గించి చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలని శివకుమార్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రైవేట్ విద్యాసంస్థలు వాటిని దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను ప్రభుత్వ పాఠశాలలకు మళ్లించడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్లు చెప్పారు. అయితే, పాఠశాలల నియంత్రణ మాత్రం ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల గురించి ప్రశ్నించగా, తాను ఇంకా సమాచారం సేకరిస్తున్నానని, పూర్తి వివరాలు తెలిశాక మాట్లాడతానని శివకుమార్ తెలిపారు.