సీనియర్ నటుడు గిరిబాబు (83) మృతి పట్ల ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం రావినూతలలో ఉంచిన గిరిబాబు భౌతికకాయాన్ని మోహన్ బాబు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తన ప్రాణస్నేహితుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మోహన్ బాబు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

గిరిబాబుతో తనకున్న 55 ఏళ్ల సుదీర్ఘ సాన్నిహిత్యాన్ని, సినీ ప్రస్థానం తొలినాళ్లలో మద్రాస్‌లో తామిద్దరం రూమ్‌మేట్స్‌గా గడిపిన రోజులను ఆయన నెమరువేసుకున్నారు. తాను ఒక గొప్ప స్నేహితుడిని, కుటుంబ సభ్యుడి వంటి ఆత్మీయుడిని కోల్పోయానని ఆవేదన చెందారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. “మా కుటుంబంలో ఇదొక విషాద సంఘటన. మాది 55 ఏళ్ల సాన్నిహిత్యం. గిరిబాబు గొప్ప స్నేహితుడు. ఆయన భార్య నాకు సొంత చెల్లెలు కంటే ఎక్కువ. ఇది మా రెండు కుటుంబాలలో విషాద సంఘటన. గిరిబాబు ఎన్నో మంచి పనులు చేశారు. నెలకు పదిసార్లు తన పుట్టిన ఊరు రావినూతలకు వచ్చేవాడు. ఇంత జర్నీ చేయడం ఎందుకు అని అంటే.. మా గ్రామానికి ఎంతో చేయాలని అనేవాడు. చాలామంది నటులు తమ పుట్టిన ఊరికి ఏమాత్రం చేస్తున్నారో అందరికీ తెలుసు. నేను ఒక గొప్ప స్నేహితుడిని, ఆత్మీయుడిని పోగొట్టుకున్నాను” అని భావోద్వేగంతో చెప్పారు.

గిరిబాబు తన పుట్టిన ఊరైన రావినూతల అభివృద్ధికి చేసిన సేవలను మోహన్ బాబు ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు. చాలామంది నటులు సినీ రంగంలో స్థిరపడ్డాక తాము పుట్టిన ఊరిని పట్టించుకోరని, కానీ గిరిబాబు మాత్రం తన సొంత గ్రామం బాగు కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. గిరిబాబు మరణం చిత్ర పరిశ్రమతో పాటు వ్యక్తిగతంగా తనకూ పూడ్చలేని లోటని పేర్కొన్నారు.