హర్మూజ్ జలసంధిలో మైన్లను ఢీకొనడంతో మూడు ఆయిల్ ట్యాంకర్లలో మంటలు చెలరేగినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ నేవీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికారిక మీడియా ద్వారా వివరాలను వెల్లడించాయి.

శనివారం ఉదయం జలసంధి తూర్పు భాగంలో ఒక ట్యాంకర్ మైన్‌ను ఢీకొట్టగా, అనంతరం నిషిద్ధ మార్గంలో ప్రయాణిస్తున్న మరో రెండు ట్యాంకర్లు కూడా మైన్లను ఢీకొన్నట్టు ఇరాన్ అధికారులు తెలిపారు. ఈ రెండు నౌకలు తమ రాడార్, నావిగేషన్ వ్యవస్థలను నిలిపివేసి ప్రయాణించాయని ఐఆర్‌జీసీ ఆరోపించింది. ప్రమాదానికి గురైన నౌకల్లో ఒకటి 'సూపర్ ట్యాంకర్' అని పేర్కొన్నప్పటికీ, ఆ నౌకల పేర్లు, ఏ దేశానికి చెందినవి, సిబ్బంది పరిస్థితి లేదా నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఇరాన్ వెల్లడించలేదు.

తమ నిబంధనలు పాటించని నౌకలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.