ఐటీ కేంద్రంగా వేగంగా విస్తరిస్తున్న పుణే నగరంలో ప్రజా రవాణాకు కొత్త ఊపునిచ్చేలా మెట్రో నెట్‌వర్క్‌లో మరో కీలక మార్గం అందుబాటులోకి వచ్చింది. హింజేవాడి నుంచి శివాజీనగర్‌ వరకు నిర్మించిన 23.2 కిలోమీటర్ల ‘పింక్‌ లైన్‌’ను నవంబర్‌ 3న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుమారు రూ.8,300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మార్గంలో రైళ్లను పూర్తిగా మహిళా లోకోపైలట్లే నడపడం విశేషం. దేశంలోనే మహిళా లోకో పైలట్లతో నడిచే తొలి మెట్రో కారిడార్‌గా ఇది గుర్తింపు పొందింది.

పుణే నగర జనాభా 1981లో 12 లక్షలకు పైగా ఉండగా.. 2011 నాటికి 31 లక్షలు దాటింది. ఐటీ, తయారీ, విద్యా రంగాల విస్తరణతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు నగరానికి వలస వచ్చారు. దీంతో రవాణా అవసరాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో 2016 డిసెంబరులో పర్పుల్‌, ఆక్వా లైన్లతో కూడిన తొలి దశ మెట్రో పనులకు శంకుస్థాపన చేశారు. 2022 మార్చిలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ఐటీ కేంద్రంగా ఉన్న హింజేవాడి మెట్రో నెట్‌వర్క్‌కు దూరంగానే ఉండిపోయింది. పింక్‌ లైన్‌తో ఆ లోటు కొంతవరకు తీరింది.

ఈ మార్గంలోని 23 స్టేషన్లలో ప్రస్తుతం 17 అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ఆరు స్టేషన్లను 2027 మార్చిలో ప్రారంభించనున్నారు. శివాజీనగర్‌లోని డిస్ట్రిక్ట్‌ కోర్టు స్టేషన్‌ వద్ద పర్పుల్‌, ఆక్వా లైన్లతో ప్రయాణికులు మార్గం మార్చుకోవచ్చు. దీంతో హింజేవాడిలోని ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, విప్రో, కాగ్నిజెంట్‌ వంటి సంస్థల్లో పనిచేసేవారికి ప్రయాణం సులభం కానుంది. రద్దీ సమయాల్లో వాకాడ్‌-హింజేవాడి మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గుతాయని ప్రయాణికులు ఆశిస్తున్నారు. అయితే కొందరికి మెట్రో ప్రయాణ సమయం ద్విచక్ర వాహన ప్రయాణంతో దాదాపు సమానంగానే ఉన్నా, సౌకర్యం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

మహిళల చేతుల్లో రైళ్ల నిర్వహణ
పింక్‌ లైన్‌ కోసం 90 మంది మహిళలు ప్రత్యేక శిక్షణ పూర్తి చేసి రైళ్ల నిర్వహణకు అవసరమైన సామర్థ్య ధ్రువపత్రాలు పొందారు. తరగతి గది పాఠాలతో పాటు ప్రాక్టికల్‌, ట్రాక్‌పై శిక్షణ తీసుకున్న వీరు ప్రస్తుతం ప్రయాణికుల రైళ్లను నడుపుతున్నారు. మొత్తం 100 మంది మహిళా ఆపరేటర్లను నియమించాలనేది ప్రణాళిక. ఈ మార్గానికి పింక్‌ లైన్‌ అని పేరు పెట్టడానికి కూడా మహిళా లోకో పైలట్లే కారణమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలిపారు.

సౌర విద్యుత్తుతో 30 శాతం అవసరాలు
ఈ కారిడార్‌ విద్యుత్‌ అవసరాల్లో 30 శాతాన్ని సౌర విద్యుత్తు ద్వారా తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం టాటా పవర్‌ రెన్యూవబుల్స్‌కు 7.67 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసే బాధ్యత అప్పగించారు. మొత్తం 23 స్టేషన్లు, మెట్రో డిపోపై సౌర ఫలకాలు ఏర్పాటు చేయనున్నారు. ఉత్పత్తయ్యే విద్యుత్తును మెట్రో అవసరాలకే వినియోగిస్తారు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు, సంప్రదాయ విద్యుత్‌ వనరులపై ఆధారపడటం తగ్గుతాయని భావిస్తున్నారు.

మరో ప్రత్యేకత 750 వోల్టుల డీసీ థర్డ్‌ రైల్‌ విద్యుదీకరణ వ్యవస్థ. దీంతో పైభాగంలో విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. రైళ్ల మధ్య సురక్షిత దూరం పాటిస్తూ తరచూ సర్వీసులు నడిపేందుకు వీలుగా సీబీటీసీ సిగ్నలింగ్‌ వ్యవస్థను వినియోగిస్తున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్‌ ఈ సాంకేతికతను అందించింది. ప్రస్తుతం సెమీ ఆటోమేటెడ్‌ విధానంలో పనిచేసేలా రూపొందించిన ఈ వ్యవస్థను భవిష్యత్తులో డ్రైవర్‌ అవసరం లేని పూర్తిస్థాయి ఆటోమేటెడ్‌ నిర్వహణకు అప్‌గ్రేడ్‌ చేసే అవకాశం ఉంది.

పీపీపీ విధానంలో తొలి మెట్రో ప్రాజెక్టు
కేంద్రం 2017లో ప్రకటించిన నూతన మెట్రో రైలు విధానంలోని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) నమూనా కింద చేపట్టిన దేశంలోనే తొలి మెట్రో ప్రాజెక్టు పుణే పింక్‌ లైన్‌. టాటా గ్రూప్‌కు చెందిన టీఆర్‌ఐఎల్‌ అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌, జర్మనీకి చెందిన సీమెన్స్‌ సంయుక్తంగా పుణే మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీతో కలిసి ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశాయి.