దేశ రక్షణలో ప్రైవేటు భద్రతా సిబ్బంది కీలక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ఆపరేషన్‌ సిందూర్‌ నిరూపించిందని మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది అన్నారు. వీరిలో ఎక్కువ మంది మాజీ సైనికులేనని, భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో సైన్యం, పోలీసు బలగాలతో పాటు వీరి పాత్ర కూడా అంతే ముఖ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం సెంట్రల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రైవేట్‌ సెక్యూరిటీ ఇండస్ట్రీ (క్యాప్సీ) నిర్వహించిన 21వ వార్షిక భద్రతా నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడారు.

దేశంలో కోటి మందికి పైగా ప్రైవేటు భద్రతా సిబ్బంది 35 వేలకుపైగా సంస్థల్లో పనిచేస్తున్నారని ద్వివేది తెలిపారు. సాధారణ ప్రజలకు భద్రత అంటే ముందుగా కనిపించేది సైన్యం, పోలీసుల కంటే అపార్ట్‌మెంట్‌ గేటు వద్ద, బ్యాంకు ప్రవేశ ద్వారం వద్ద, ఆసుపత్రుల వద్ద విధులు నిర్వహించే సిబ్బందేనని చెప్పారు. విద్యుత్‌ కేంద్రాలు, బొగ్గు గనులు, పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఓడరేవుల వంటి కీలక రంగాల్లోనూ వీరు భద్రత కల్పిస్తున్నారని వివరించారు. దేశ భద్రత కేవలం నియంత్రణ రేఖ వద్దే నిర్ణయం కాదని, అర్ధరాత్రి విద్యుత్‌ కేంద్రం గేటు వద్ద కూడా అంతే కీలకమని వ్యాఖ్యానించారు.

ఆపరేషన్‌ సిందూర్‌లో డ్రోన్లను అడ్డుకోవడంలో ఏ ఒక్క ఆయుధమో, సంస్థో పనిచేయలేదని ద్వివేది గుర్తుచేశారు. ఒక సంస్థ సెన్సర్లు, మరో సంస్థ జామర్లు, ఇంకొక సంస్థ తుపాకులు సమన్వయంతో పనిచేయడం వల్లే రక్షణ సాధ్యమైందన్నారు. అంతర్గత భద్రతలోనూ ఇలాంటి సమన్వయం అవసరమని చెప్పారు. ప్రైవేటు భద్రతా సిబ్బంది స్థానిక పోలీస్‌ స్టేషన్ల అధికారులతో సంబంధాలు ఏర్పరచుకోవాలని, అగ్నిమాపక, పౌర రక్షణ విభాగాలతో కలిసి కసరత్తులు నిర్వహించాలని సూచించారు. గార్డులు అందించే సమాచారాన్ని కూడా అధికారులు తీవ్రంగా పరిగణించాలని అన్నారు.

ప్రస్తుతం సంఘర్షణలు భౌతిక ప్రపంచంతో పాటు డిజిటల్‌ రంగం, ప్రజల ఆలోచనా విధానాల్లోనూ జరుగుతున్నాయని ద్వివేది హెచ్చరించారు. వదంతులు, తీవ్రవాద భావజాలానికి లోనైన వ్యక్తులు, సంస్థల్లోని సమాచార భద్రతా లోపాలు కూడా ముప్పుగా మారవచ్చని పేర్కొన్నారు. శిక్షణ పొందిన, సమన్వయంతో పనిచేసే కోటి మంది భద్రతా సిబ్బంది దేశానికి వ్యూహాత్మక బలమని, గుర్తింపు, శిక్షణ లేకపోతే అదే బలహీనతగా మారుతుందని అన్నారు.

అనుభవానికి గుర్తింపు.. నైపుణ్యాలకు ధ్రువీకరణ
15 ఏళ్ల అనుభవం ఉన్న భద్రతా సిబ్బందికి అగ్నిప్రమాదాలు, జనసమూహాల నియంత్రణ, దొంగతనాలు, వైద్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం ఉన్నప్పటికీ, పత్రాల్లో నైపుణ్యం లేని వారిగా పేర్కొనడం అన్యాయమని ద్వివేది అన్నారు. మాజీ సైనికుల గత అనుభవానికి గుర్తింపు ఇవ్వడంతో పాటు, వారి సామర్థ్యాలకు అధికారిక ధ్రువీకరణ కల్పించడంపై సదస్సు దృష్టి పెట్టిందని వివరించారు.

గార్డింగ్‌ ఆఫీసర్‌ కార్యక్రమం ద్వారా భద్రతా సిబ్బందికి కొత్త హోదా కల్పించే ప్రయత్నాన్ని ఆయన ప్రస్తావించారు. దీనికి సెప్టెంబరులో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) లభించినట్లు తనకు తెలిసిందన్నారు. శిక్షణ, అంచనా, ధ్రువీకరణ కోసం రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీతో క్యాప్సీ కుదుర్చుకున్న ఒప్పందాన్ని అభినందించారు. అయితే కొత్త హోదా కేవలం పేరుకే పరిమితం కాకుండా, ధ్రువీకరించిన నైపుణ్యం, స్పష్టమైన బాధ్యతలు, గార్డు స్థాయి నుంచి సూపర్‌వైజర్‌, మేనేజర్‌ స్థాయికి ఎదిగే అవకాశాలు ఉండాలని సూచించారు. ప్రైవేటు భద్రతా సంస్థల నియంత్రణ చట్టం (పీఎస్‌ఏఆర్‌ఏ) కింద లైసెన్సుల జారీ ప్రక్రియను మరింత సరళంగా, వేగంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.