మైదానంలో ప్రత్యర్థులుగా తలపడినా.. ఆట ముగిశాక పరస్పరం గౌరవించుకోవడంలో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు. న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో భారత బ్యాటింగ్‌ పతనానికి కారణమైన కివీస్‌ పేసర్‌ మాట్‌ హెన్రీకి తన జెర్సీని బహుమతిగా ఇచ్చి మరోసారి క్రీడాస్ఫూర్తిని చాటాడు.

మౌంట్‌ మాంగనూయిలోని బే ఓవల్‌ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో హెన్రీ నిప్పులు చెరిగే బంతులతో భారత్‌ను దెబ్బతీశాడు. తన వన్డే కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేస్తూ 27 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌లను డకౌట్‌ చేశాడు. వన్డేల్లో భారత్‌ తొలి 3 వికెట్లను పరుగులేమీ చేయకుండానే కోల్పోవడం ఇదే తొలిసారి.

హెన్రీ బౌలింగ్‌లో నాలుగు బంతులాడి డకౌటైన కోహ్లీ.. మ్యాచ్‌ అనంతరం అతడిని అభినందించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్న హెన్రీని కలిసి తన టీమిండియా జెర్సీని అందించాడు. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ మ్యాచ్‌ గురించి కాసేపు మాట్లాడుకున్నారు.

కోహ్లీని హెన్రీ ఐదో బంతికి క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. తొలుత బయటకు వెళ్లేలా బంతులు వేసిన అతడు.. ఆ తర్వాత లోపలికి దూసుకొచ్చే బంతితో కోహ్లీని బోల్తా కొట్టించాడు. అనంతరం శ్రేయస్‌ అయ్యర్‌ను రివ్యూ ద్వారా ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్‌ (27), అక్షర్‌ పటేల్‌ (21), నమన్‌ ధీర్‌ (21) కొంత పోరాడినా భారత్‌ లక్ష్యం దిశగా సాగలేకపోయింది. రెండోసారి బౌలింగ్‌కు వచ్చిన హెన్రీ మరో మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ భారీ విజయానికి బాటలు వేశాడు.

మ్యాచ్‌ అనంతరం హెన్రీ మాట్లాడుతూ.. గాలి బలంగా వీస్తుండడంతో పెద్దగా ప్రయోగాలు చేయకుండా సాధారణంగానే బౌలింగ్‌ చేశానని చెప్పాడు. కొత్త బంతితో బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టేందుకు కొద్దిసేపు మాత్రమే అవకాశం ఉంటుందని, వికెట్లను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్‌ చేశానని వివరించాడు. తొలి ఓవర్లో బంతి అనూహ్యంగా స్వింగ్‌ కావడం తనకు కలిసొచ్చిందన్నాడు.