క్యాబ్‌ బుక్‌ చేసుకునే సమయంలో ప్రయాణం ప్రారంభం కాకముందే అదనపు డబ్బులు చెల్లించేలా వినియోగదారులను ప్రోత్సహిస్తున్న ఓలా తీరుపై కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) చర్యలు తీసుకుంది. ఈ విధానాన్ని అన్యాయమైన వ్యాపార పద్ధతిగా, వినియోగదారులను తప్పుదోవ పట్టించే డార్క్‌ ప్యాటర్న్‌గా పేర్కొంటూ రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

ఓలా క్యాబ్‌ సేవలు నిర్వహించే ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఈ జరిమానా విధించింది. సీసీపీఏ చీఫ్‌ కమిషనర్‌ నిధి ఖరే, కమిషనర్‌ అనుపమ్‌ మిశ్రా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఓలా యాప్‌లో డ్రైవర్‌ కోసం వెతుకుతున్న సమయంలో 'టిప్‌' పేరుతో అదనపు మొత్తం చెల్లించే ఆప్షన్‌ కనిపించేది. ఇలా డబ్బులు చెల్లిస్తే త్వరగా క్యాబ్‌ దొరికే అవకాశాలు పెరుగుతాయని యాప్‌ సూచించేది. ఆ తర్వాత కంపెనీ ఈ ఫీచర్‌ పేరును 'యాడ్‌ ఆన్‌'గా మార్చింది. అయితే విధానంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.

'టిప్‌ ఇస్తే త్వరగా రైడ్‌ లభించే అవకాశాలు పెరగవచ్చు', 'త్వరగా రైడ్‌ కన్ఫర్మేషన్‌ పొందాలంటే అదనంగా చెల్లించండి' వంటి సందేశాలను యాప్‌లో ప్రదర్శించినట్లు సీసీపీఏ గుర్తించింది. డ్రైవర్‌ కోసం అన్వేషణ జరుగుతున్న సమయంలోనే ఈ సందేశాలు, ముందుగా నిర్ణయించిన చెల్లింపు మొత్తాల పైన కనిపించేవి. దీంతో అదనపు డబ్బులు చెల్లిస్తే క్యాబ్‌ త్వరగా దొరుకుతుందనే అభిప్రాయం వినియోగదారుల్లో కలుగుతోందని సంస్థ పేర్కొంది. సందేశాల్లో 'అవకాశం ఉండొచ్చు' వంటి పదాలు ఉపయోగించినా, వినియోగదారులకు కలిగే మొత్తం అభిప్రాయం మారదని స్పష్టం చేసింది.

యాడ్‌ ఆన్‌ చెల్లింపులు డ్రైవర్‌కు రైడ్‌ కేటాయించే ప్రక్రియపై ప్రభావం చూపవని ఓలా చెబుతున్నప్పటికీ, యాప్‌లో మాత్రం అదనపు చెల్లింపుతో త్వరగా క్యాబ్‌ లభించే అవకాశాలు పెరుగుతాయని సూచించడాన్ని సీసీపీఏ తప్పుబట్టింది. అంతేకాకుండా యాడ్‌ ఆన్‌ చెల్లింపులు ఉన్న రైడ్‌ అభ్యర్థనలను డ్రైవర్లు తక్కువగా అంగీకరిస్తున్నారనే సమాచారం కూడా వినియోగదారులకు వెల్లడించలేదని గుర్తించింది. సూచించిన చెల్లింపు మొత్తాలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారో కూడా వివరించలేదని పేర్కొంది. ఈ చర్యలు వినియోగదారుల రక్షణ చట్టం-2019లోని సెక్షన్‌ 2(28)(iv) కింద కీలక సమాచారాన్ని దాచిపెట్టినట్లేనని తేల్చింది.

సాధారణంగా ఒక సేవ పూర్తయ్యాక స్వచ్ఛందంగా ఇచ్చే మొత్తాన్నే టిప్‌ అంటారు. కానీ ప్రయాణం ప్రారంభం కాకముందే దాన్ని అడగడం ద్వారా స్వచ్ఛంద చెల్లింపును ముందస్తు చెల్లింపుగా మార్చినట్లవుతుందని సీసీపీఏ అభిప్రాయపడింది. ఫీచర్‌ పేరును 'టిప్‌' నుంచి 'యాడ్‌ ఆన్‌'గా మార్చినంత మాత్రాన ఆ విధానం స్వభావం మారదని స్పష్టం చేసింది.