ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఐఐ భాగస్వామ్య సదస్సులో తన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. సదస్సు రెండో రోజున సీనియర్ జర్నలిస్ట్ పాల్కీ శర్మ నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్‌లో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చేపట్టిన సంస్కరణలు, ముఖ్యంగా ఐటీ రంగంలో తన దార్శనికత గురించి చంద్రబాబు వివరించారు.

భవిష్యత్తు ఐటీ రంగానిదేనని తాను ఆనాడే ఊహించి, దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్‌ను కలిసి, హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేలా ఒప్పించిన విధానాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. భారతదేశంలో గణితం, ఇంగ్లీష్‌ సబ్జెక్టులలో నైపుణ్యం ఉన్న మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇది ఐటీ రంగ విస్తరణకు ఎంతగానో దోహదపడుతుందని తాను బిల్ గేట్స్‌కు వివరించినట్లు చెప్పారు.

ఐటీ పరిశ్రమకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. అయితే, తాను ఐటీకి ప్రాధాన్యత ఇస్తుంటే, నాటి ప్రతిపక్షాలు తనను తీవ్రంగా విమర్శించేవని అన్నారు. కేవలం ఐటీ రంగమే కాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా విద్యుత్ సంస్కరణలు కూడా తానే తీసుకొచ్చానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.