దేశంలో క్యాబ్ రెంటల్ వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు, ప్రయాణికుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ద్వారా చిన్న వ్యాపారులకు అవకాశాలు కల్పించడంతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.

ఈ ప్రతిపాదనల ప్రకారం.. క్యాబ్ రెంటల్ వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైన కనీస కార్ల సంఖ్యను 50 నుంచి కేవలం 5కి తగ్గించారు. అలాగే, ఒకే లైసెన్స్‌తో రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అంతటా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో వేర్వేరు బ్రాంచ్‌లకు ప్రత్యేక లైసెన్సులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. లైసెన్స్ జారీ, పునరుద్ధరణ ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేయాలని, కొత్త కార్లను చేర్చడానికి లేదా తీసివేయడానికి 30 రోజుల్లో ఆటోమేటిక్ అనుమతులు ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని ప్రతిపాదించారు.

ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రతి క్యాబ్‌లో లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ (జీపీఎస్), ప్రథమ చికిత్స కిట్ తప్పనిసరి చేశారు. ఆపరేటర్లు తప్పనిసరిగా ఒక వెబ్‌సైట్‌ను, 24 గంటల పాటు పనిచేసే ఫిర్యాదుల పరిష్కార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అత్యవసర సమయాల్లో రిపేర్, టోయింగ్ సేవలు కూడా అందించాల్సి ఉంటుంది.

ఆపరేటర్లు అందించే డ్రైవర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి అని, వారికి సామాజిక భద్రతా చట్టం-2020 ప్రకారం ప్రయోజనాలు కల్పించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డ్రైవర్లు లేదా ఆపరేటర్లు తీవ్రమైన నేరాలకు పాల్పడితే వారి లైసెన్స్ గడువును తగ్గించేలా కఠిన నిబంధనలు చేర్చారు. ఈ సంస్కరణల వల్ల చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహం లభించి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అదే సమయంలో ప్రయాణికులకు మెరుగైన భద్రత, మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.