తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రెండు రోజుల పాటు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సమయంలో రాష్ట్రంలో ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది.

ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా తగ్గడం వల్ల సీజనల్ ఫ్లూ, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. రవీందర్ నాయక్ హెచ్చరించారు. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, తీవ్ర అలసట వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేశారు.

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముక్కు, నోటికి రుమాలు అడ్డు పెట్టుకోవాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని అధికారులు సూచించారు. అనారోగ్య లక్షణాలు ఉన్నవారు బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా 108 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవచ్చని వైద్యారోగ్య శాఖ పేర్కొంది.