ఆస్తి హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. తాత ఆస్తి పంపకాల్లో భాగంగా తండ్రికి సంక్రమించిన ఆస్తిపై మనవడికి జన్మతః ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం, 1956లోని సెక్షన్ 8 ప్రకారం తండ్రి పొందిన ఆస్తి, అతని వ్యక్తిగత ఆస్తిగా పరిగణించబడుతుందని, అది ఉమ్మడి కుటుంబ ఆస్తి కాదని తెలిపింది.

జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సునీత అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. జె. రాజేష్ (మైనర్) తన తల్లి జె. గోమతి ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. చెన్నైలోని ఒక ఆస్తిలో తనకు సగం వాటా ఇప్పించాలని కోరుతూ రాజేష్ ఈ పిటిషన్ వేశాడు. ఈ ఆస్తిని అతని తండ్రి 1994లో ఒక పంపకాల దావాలో రాజీ డిక్రీ ద్వారా పొంది, 1997లో విక్రయించారు.

ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, హిందూ వారసత్వ చట్టంలోని నిబంధనలను కూలంకషంగా వివరించింది. వీలునామా రాయకుండా ఒక హిందూ పురుషుడు మరణించినప్పుడు, అతని ఆస్తి సెక్షన్ 8 ప్రకారం మొదటి తరగతి వారసులకు చెందుతుందని పేర్కొంది. ఈ వారసులలో కొడుకు, ముందుగా చనిపోయిన కొడుకు యొక్క కొడుకు ఉంటారు కానీ, బ్రతికి ఉన్న కొడుకు యొక్క కొడుకు (మనవడు) ఉండడని ధర్మాసనం స్పష్టం చేసింది.

పంపకాల ద్వారా కొడుకు పొందిన ఆస్తి అతని వ్యక్తిగత హోదాలో ఉంటుందని, అది హిందూ ఉమ్మడి కుటుంబ ఆస్తిగా మారదని కోర్టు స్పష్టం చేసింది. ఒకసారి ఆస్తి పంపకాలు జరిగాక, అది ఉమ్మడి కుటుంబ భావాన్ని కోల్పోతుంది. వారసులు తమ వాటాలను వ్యక్తిగతంగా కలిగి ఉంటారు. అందువల్ల ఆ ఆస్తిపై అతని పిల్లలకు (మనవళ్లకు) జన్మతః హక్కులు లభించవని ధర్మాసనం పేర్కొంది.

పిటిషనర్ (మనవడు) పుట్టకముందే వారసత్వం ప్రారంభమైందని, ఈ కేసుకు హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 6 గానీ, కుమార్తెలకు సమాన హక్కులు కల్పించే తమిళనాడు సవరణ గానీ వర్తించదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కారణాలతో ఆస్తిలో వాటా కోరుతూ మనవడు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ, హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.