అంతర్జాతీయ టీ20 జట్టులో చోటు కోల్పోయి, కొన్ని నెలల పాటు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నానని టీమిండియా స్టార్ బ్యాటర్, 2026 టీ20 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు నాయకత్వం వహించడానికి సిద్ధమవుతున్న సూర్య.. ఈ సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, తన కెరీర్‌లోని ఎత్తుపల్లాలను, వ్యక్తిగత జీవితంలోని మార్పులను పంచుకున్నాడు.

టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కొన్ని నెలలు చాలా కష్టంగా గడిచాయని సూర్య ఒప్పుకున్నాడు. "ఆ వాస్తవం నుంచి పారిపోవాలనుకోవడం లేదు. మనతో మనం నిజాయతీగా లేకపోతే సంతోషంగా బతకడం కష్టం. ఆ సమయం నాకు చాలా క్లిష్టంగా గడిచింది. అయితే, ఈ ఏడాది మే నెలలో నాకు పాప పుట్టింది. దాంతో నా దృష్టి మొత్తం ఆమె వైపు మళ్లింది. గత కొన్ని నెలలుగా జీవితం చాలా అందంగా ఉంది" అని సూర్య తెలిపాడు.

క్రికెట్‌పై మళ్లీ ప్యాషన్ ఎలా పెంచుకున్నదీ వివరిస్తూ "ఒకప్పుడు 15 ఏళ్ల వయసులో ముంబై అండర్-15 జట్టుకు ఆడాలనుకున్నప్పుడు నాలో ఎంతటి ప్యాషన్ ఉండేదో, దాన్ని మళ్లీ తీసుకురావాలని నా భార్య చెప్పింది. ఆ మాటలతో ఆలోచనలో పడి, 15-16 ఏళ్ల క్రితం నేను ఎలా ఉండేవాడినో గుర్తుచేసుకున్నాను. ఇప్పుడు మళ్లీ అదే ప్యాషన్, అదే ప్రేమతో శిక్షణ పొందుతున్నాను. అంతా మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది" అని అన్నాడు.

త్వరలో ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు సారథ్యం వహించనున్నట్లు సూర్య తెలిపాడు. రంజీ ట్రోఫీ సీజన్‌లో జట్టుకు దూరమైనప్పటికీ, ఈ టోర్నీ ద్వారా యువ ఆటగాళ్లతో సమయం గడిపి, తన 16 ఏళ్ల అనుభవాన్ని వారితో పంచుకోవాలని ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. "ఈసారి జట్టును ముందుండి నడిపించి, టోర్నమెంట్ గెలవాలని బలంగా కోరుకుంటున్నాను" అని విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా తన పాత రోజులను గుర్తుచేసుకుంటూ "2010-11లో నేను తొలిసారి ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టినప్పుడు అక్కడ సచిన్ టెండూల్కర్, అమోల్ మజుందార్, అజిత్ అగార్కర్ వంటి దిగ్గజాలు ఉండేవారు. నేను ఎంతో ఆరాధించే వారితో సమయం గడిపేవాడిని. సచిన్ సర్ అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో తను కూర్చునే చోటును నాకు ఇచ్చారు. అది నా జీవితంలో చాలా ప్రత్యేకమైన, చిరస్మరణీయమైన క్షణం" అని సూర్య చెప్పాడు. నేటి యువ ఆటగాళ్లలో కసి, పట్టుదల ఎక్కువగా ఉన్నాయని, వారికి సరైన మార్గనిర్దేశం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు.