అమెరికా రక్షణ మంత్రి (పెంటగాన్ చీఫ్) పీట్ హెగ్సెత్‌పై అభిశంసన ప్రవేశపెట్టేందుకు జరిగిన ప్రయత్నం విఫలమైంది. ఇరాన్‌తో యుద్ధం, ఇతర దేశాల్లో చట్టవిరుద్ధ సైనిక చర్యల నిర్వహణ వంటి అంశాలపై ఆయనను పదవి నుంచి తొలగించాలనే తీర్మానాన్ని ప్రతినిధుల సభ తిరస్కరించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హెగ్సెత్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించడంతో, రిపబబ్లికన్ పార్టీ సభ్యులు దాదాపు ఏకతాటిపై నిలిచి ఈ తీర్మానాన్ని అడ్డుకున్నారు.

రిపబ్లికన్ పార్టీ సభ్యుడు థామస్ మాస్సీ, డెమోక్రాట్ల మద్దతుతో ఈ అభిశంసన తీర్మానాన్ని సభ ముందుకు తెచ్చారు. అయితే, దీనిపై జరిగిన ఓటింగ్‌లో 211-204 ఓట్ల తేడాతో తీర్మానం వీగిపోయింది. ఇరాన్‌తో యుద్ధం, దాని ఫలితంగా పెరిగిన గ్యాస్ ధరల వల్లే మధ్యంతర ఎన్నికల్లో నష్టపోయామని కొందరు రిపబ్లికన్లు భావిస్తున్నప్పటికీ, ట్రంప్ మద్దతుతో హెగ్సెత్ గండం నుంచి బయటపడ్డారు.

హెగ్సెత్‌పై ఎనిమిది అభియోగాలతో మాస్సీ ఈ తీర్మానాన్ని రూపొందించారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా 256 రోజులుగా ఇరాన్‌తో యుద్ధం కొనసాగించడం చట్టవిరుద్ధమని ఆయన ఆరోపించారు. చట్ట ప్రకారం కాంగ్రెస్ ఆమోదం లేని సైనిక చర్యలను 60 రోజుల్లోగా నిలిపివేయాలని ఆయన గుర్తుచేశారు. ఇరాన్‌లోని ఒక పాఠశాలపై అమెరికా జరిపిన క్షిపణి దాడిలో 168 మంది మరణించడం, యెమెన్, వెనిజులాలో సైనిక చర్యలు వంటివి ఇతర ప్రధాన అభియోగాలు.

మరోవైపు నెలల తర్వాత తొలిసారి మీడియా సమావేశంలో మాట్లాడిన హెగ్సెత్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇది దేశభక్తి కాదని, సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధ్వంసకర చర్య అని విమర్శించారు. తనపై వచ్చినవి విధానపరమైన విభేదాలే తప్ప, అభిశంసనకు అవసరమైన తీవ్రమైన నేరాలు కావని స్పష్టం చేశారు. ట్రంప్ కూడా హెగ్సెత్‌ను 'గొప్ప అమెరికా దేశభక్తుడు' అని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రస్తుతానికి ఈ అభిశంసన యత్నం ఆగిపోయినప్పటికీ, జనవరిలో ప్రతినిధుల సభ, సెనెట్‌పై డెమోక్రాట్లు పట్టు సాధించనున్నారు. ఆ తర్వాత హెగ్సెత్ అభిశంసన అంశాన్ని మళ్లీ లేవనెత్తుతామని డెమోక్రాటిక్ నేతలు హకీమ్ జెఫ్రీస్, చక్ షుమర్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. హెగ్సెత్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని, జాతీయ భద్రతను బలహీనపరిచారని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వివాదం భవిష్యత్తులో మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది.