వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, 'యూనివర్స్ బాస్'గా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన క్రిస్ గేల్ మరోసారి తన బ్యాట్‌కు పనిచెప్పనున్నాడు. కొత్తగా ప్రారంభం కానున్న ఇటాలియా టీ10 లీగ్‌లో ఆయన వెనిస్ లైవ్‌వైర్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. ఈ ఫ్రాంచైజీకి భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ టీమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ కొత్త ప్రయాణంపై క్రిస్ గేల్ సంతోషం వ్యక్తం చేశాడు. "ఇటాలియా టీ10 లీగ్‌లో వెనిస్ లైవ్‌వైర్స్ తరఫున ఆడనుండటం ఎంతో ఉత్సాహంగా ఉంది. టీ10 క్రికెట్ చాలా వేగంగా, వినోదాత్మకంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి ఇదొక మంచి అవకాశం. ఇటలీలో కాస్త వినోదం, భారీ శక్తిని తీసుకువస్తానని ఆశిస్తున్నా" అని గేల్ అన్నాడు.

గేల్ రాకపై టీమ్ డైరెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. "క్రిస్ గేల్ రాక మా జట్టుకు బూస్ట్. ప్రపంచంలోని అతిపెద్ద ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడిన ఆయన అనుభవం మాకు ఎంతో విలువైనది. కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా, తీవ్రమైన ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో ఆయనకు తెలుసు. సహచరులను స్ఫూర్తి నింపగల సత్తా ఆయనకుంది. అలాంటి ఆటగాడికి మా ఫ్రాంచైజీలోకి స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది" అని ఎమ్మెస్కే ప్రసాద్ వివరించాడు.

ఫ్రాంచైజీ ఛైర్మన్ మోహిత్ మాట్లాడుతూ.. "గేల్‌ను జట్టులోకి తీసుకోవడం గర్వకారణం. ఆయన ఒక గ్లోబల్ క్రికెటింగ్ ఐకాన్. ఆయన చేరిక మా ఫ్రాంచైజీ బ్రాండ్ విలువను మరింత పెంచుతుంది. బలమైన అంతర్జాతీయ గుర్తింపు, గెలిచే తత్వంతో మేము జట్టును నిర్మిస్తున్నాం. మా ఆశయాలకు గేల్ చేరిక అద్దం పడుతోంది" అని తెలిపాడు.

2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, క్రిస్ గేల్ ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లు, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో పాల్గొంటూ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. ఇటీవలే జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026 టోర్నీలో ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై గెలిచి తన జట్టుకు టైటిల్ అందించాడు. గేల్ వంటి విధ్వంసకర ఆటగాడి చేరికతో ఇటాలియా టీ10 లీగ్‌లో వెనిస్ లైవ్‌వైర్స్ ఒక శక్తివంతమైన జట్టుగా నిలుస్తుందని ఫ్రాంచైజీ ధీమా వ్యక్తం చేస్తోంది.