ప్రముఖ రెస్టారెంట్ చైన్ సాగర్ రత్నలో ఆహార పరిశుభ్రతకు సంబంధించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని ఓ ఔట్‌లెట్‌లో కస్టమర్ ఆర్డర్ చేసిన దోశలో చచ్చిన బొద్దింక కనిపించడం కలకలం రేపింది. బాధితుడు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. రుషిల్ దత్తా అనే వ్యక్తి ఢిల్లీలోని అశోక్ విహార్‌లో ఉన్న సాగర్ రత్న రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ తాను ఆర్డర్ చేసిన దోశ తినడం దాదాపు పూర్తయిన తర్వాత, అందులోని ఆలూ మసాలాలో చచ్చిన బొద్దింకను చూసి షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనను వీడియో తీస్తూ.. "ఈరోజు నవంబర్ 9, మేము సాగర్ రత్నలో ఉన్నాం. ఇక్కడ ఆహారంలో బొద్దింక వచ్చింది" అని ఆయన వివరించారు.

ఈ విషయం తెలిశాక తనకు చాలా అసహ్యంగా, అనారోగ్యంగా అనిపిస్తోందని రుషిల్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. గతంలో ఆగస్టు 30న కూడా ఇదే రెస్టారెంట్‌లో మరో కస్టమర్‌కు ఆహారంలో పురుగు కనిపించిందని ఆయన ఆరోపించారు. "నాకు గానీ, నా కుటుంబానికి గానీ ఏదైనా జబ్బు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇంత నిర్లక్ష్యంగా, అపరిశుభ్రంగా ఎలా ఉంటారు?" అని ఆయన ప్రశ్నించారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్ పరిశుభ్రతా ప్రమాణాలపై విమర్శలు గుప్పిస్తూ, 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (ఎఫ్ఎస్ఎస్ఏఐ)ను ట్యాగ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై సాగర్ రత్న యాజమాన్యం నుంచి ఇంకా స్పందన రావాల్సి ఉంది.