అమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన వారు మరోసారి తమ సత్తా చాటారు. అరిజోనా రాష్ట్ర సెనేట్‌కు అధ్యక్షురాలిగా డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఇండో-అమెరికన్ ప్రియా సుందరేశన్ ఎన్నికయ్యారు. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత అరిజోనా సెనేట్‌లో డెమోక్రాటిక్ పార్టీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించిన నేపథ్యంలో ప్రియాకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. 2027 జనవరిలో ఆమె ఈ పదవిని అధికారికంగా చేపట్టనున్నారు.

ఈ నెల‌ 6న జరిగిన ఎన్నికల అనంతరం సెనేట్‌లోని డెమోక్రాట్లు ప్రియా సుందరేశన్‌ను తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు 30 సెనేట్ స్థానాలకు గాను 20 స్థానాలు గెలుచుకుని, మూడింట రెండొంతుల మెజారిటీని కైవసం చేసుకున్నారు. గతంలో వీరికి కేవలం 13 సీట్లు మాత్రమే ఉండేవి. 

తాజా ఫలితాలతో 1992 తర్వాత తొలిసారి సెనేట్‌పై డెమోక్రాట్లు పట్టు సాధించారు. కేవలం సెనేట్‌లోనే కాకుండా 60 స్థానాలున్న ప్రతినిధుల సభలో 37 స్థానాలను, గవర్నర్ పదవిని కూడా డెమోక్రాట్లే దక్కించుకున్నారు. దీంతో 1966 తర్వాత తొలిసారిగా అరిజోనాలో పరిపాలన, శాసన వ్యవస్థలపై డెమోక్రాటిక్ పార్టీకి పూర్తి నియంత్రణ లభించింది.

ఈ సందర్భంగా ప్రియా సుందరేశన్ మాట్లాడుతూ.. "అరిజోనా ప్రజలు తీవ్రమైన పక్షపాత రాజకీయాలను తిరస్కరించి, కొత్త దిశను ఎంచుకున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. సామాన్య కుటుంబాలపై భారం తగ్గించడం, దక్షిణ అరిజోనా ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం మా లక్ష్యం" అని స్పష్టం చేశారు. 

"దక్షిణ అరిజోనాకు శాసనసభలో సరైన ప్రాతినిధ్యం లేదని ఎప్పుడూ ఫిర్యాదులు వినిపించేవి. ఇప్పుడు మేం ఇక్కడ ఉన్నాం" అంటూ తన ప్రాంతానికి భరోసా ఇచ్చారు. విశ్వవిద్యాలయాలకు నిధులు, రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై దృష్టి సారిస్తామని ఆమె తెలిపారు.

భారత సంతతికి చెందిన కుటుంబంలో టూసాన్‌లో జన్మించిన ప్రియా సుందరేశన్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు. అనంతరం అరిజోనా విశ్వవిద్యాలయంలో లా, అగ్రికల్చరల్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె పర్యావరణ చట్టంలో నిపుణురాలిగా, ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2022లో తొలిసారిగా సెనేటర్‌గా ఎన్నికైన ఆమె, ఇప్పుడు ఏకంగా సెనేట్ అధ్యక్షురాలి స్థాయికి ఎదిగారు.