నల్గొండ జిల్లా వైద్యారోగ్య శాఖలో సంచలనం సృష్టించిన నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం కేసులో పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. పదవీ విరమణ తర్వాత మరణించిన ఉద్యోగిని, సర్వీసులో ఉండగానే చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఆయన కుమారుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించిన ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసిన చామకూరి వెంకటేశ్వర్లు, 2025 మే 31న పదవీ విరమణ చేశారు. అనారోగ్యంతో అదే ఏడాది నవంబర్ 17న ఆయన మరణించారు. అయితే, కారుణ్య నియామకం నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ తర్వాత మరణిస్తే ఉద్యోగం రాదు. దీంతో, ఆయన కుటుంబ సభ్యులు కొందరు అధికారులతో కుమ్మక్కై భారీ స్కెచ్ వేశారు.

వెంకటేశ్వర్లు సర్వీసులో ఉండగానే, అంటే 2025 మే 28న చనిపోయినట్లు నకిలీ రికార్డులు తయారు చేశారు. ఇందుకోసం ముందుగా ఆయన ఆధార్ కార్డులోని చిరునామాను మీ-సేవా కేంద్రం ద్వారా నల్గొండ పట్టణానికి మార్చారు. ఆ తర్వాత నల్గొండ మున్సిపాలిటీ అధికారుల సాయంతో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం పొందారు.

ఈ నకిలీ పత్రాలను ఉపయోగించి వెంకటేశ్వర్లు కుమారుడు చామకూరి రాజుకు దామరచర్ల పీహెచ్‌సీలో ఉద్యోగం ఇప్పించారు. ఈ ఉద్యోగం కోసం సుమారు రూ.13 లక్షల డీల్ జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతుడి భార్య వసంత, డీఎంహెచ్‌వో కార్యాలయ సీసీ పోలె రంజిత్ కుమార్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుర్తించారు.

ఈ మోసంపై నల్గొండ మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ నవంబర్ 4న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. లోతుగా దర్యాప్తు చేపట్టి మృతుడి భార్య వసంత, కుమారుడు రాజు, బంధువులు, మున్సిపల్ వార్డు ఆఫీసర్ శివ జనార్ధన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి రూ.5 లక్షల నగదు, కంప్యూటర్, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.