తాను పదవి నుంచి వైదొలగడానికి ముందు భారీ సంఖ్యలో క్షమాభిక్షలు ప్రసాదిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన ప్రభుత్వంలో పనిచేసిన వారు భవిష్యత్తులో రాజకీయ కక్షసాధింపులకు గురికాకుండా కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"అధికారం నుంచి దిగిపోయే ముందు మీరు పెద్ద ఎత్తున క్షమాభిక్షలు ఇస్తారా?" అని అడగ్గా.. "అవును, కచ్చితంగా ఇస్తాను. భారీ సంఖ్యలో క్షమాభిక్షలు మంజూరు చేయాలని భావిస్తున్నాను" అని ట్రంప్ సమాధానమిచ్చారు. తన హయాంలో పనిచేసిన అధికారులు, సిబ్బంది తమ జీవితాంతం రాజకీయ ప్రత్యర్థులతో న్యాయపోరాటాలు చేయాల్సిన అవసరం లేకుండా చూడటమే తన ఉద్దేశమని వివరించారు. అయితే, తనకు తాను క్షమాభిక్ష ఇచ్చుకునే అధికారం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ ఆలోచన లేదని ట్రంప్ తేల్చి చెప్పారు.

జనవరి 6న క్యాపిటల్ భవనంపై జరిగిన దాడికి సంబంధించి గతంలో ఇచ్చిన క్షమాభిక్షలను ట్రంప్ సమర్థించుకున్నారు. ఆ ఘటనలో నిందితుల పట్ల అన్యాయంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో, తన రాజకీయ ప్రత్యర్థులైన జేమ్స్ కోమీ, నాన్సీ పెలోసీ వంటి వారిని ఎప్పటికీ క్షమించలేనని స్పష్టం చేశారు. "కొంతమంది శత్రువులను నేను ద్వేషిస్తాను, ఎప్పటికీ ద్వేషిస్తూనే ఉంటాను" అని ఆయన వ్యాఖ్యానించారు.

తన అధ్యక్ష పదవీ కాలాన్ని ప్రజలు ఎలా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నారని అడగ్గా.. "నేను అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలబెట్టానని ప్రజలు గుర్తుంచుకోవాలి" అని ట్రంప్ సమాధానమిచ్చారు.