ఇరాన్‌పై మరోసారి యుద్ధం చేయాల్సిన అవసరం రాకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. అణు కార్యక్రమం, హర్మూజ్‌ జలసంధి పునఃప్రారంభంపై చర్చలు సానుకూలంగా సాగితే కొత్తగా సైనిక దాడులు చేసే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు. అయితే అమెరికాతో బలమైన ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోతే మాత్రం మరోసారి సైనిక చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు.

సీఎన్‌ఎన్‌కు ఆదివారం ఇచ్చిన 20 నిమిషాల ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చలు ముందుకు సాగితే యుద్ధం అవసరం ఉండకపోవచ్చని పలుమార్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్‌పై అమెరికా సైనికంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నారు. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం 301 శాతానికి చేరిందని వ్యాఖ్యానించారు.

మరోవైపు అవసరమైతే ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని ట్రంప్ వెల్లడించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో మూడు విమాన వాహక నౌకలు మోహరించి ఉన్నాయని చెప్పారు. అవి పూర్తిస్థాయిలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలు సహా కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. తమ వద్ద 38 వంతెనల వివరాలు ఉన్నాయని, గంటలో వాటిని ధ్వంసం చేయగలమని హెచ్చరించారు. అయితే వాటిని నాశనం చేయడం తనకు ఇష్టం లేదన్నారు. తిరిగి నిర్మించుకోవడానికి పదేళ్లు పట్టవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇటీవల అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో పశ్చిమాసియాలో దౌత్య ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఖతార్‌ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్‌ థానీతో ట్రంప్ చర్చించినట్లు ఖతార్ వెల్లడించింది.

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, పాకిస్థాన్ సహా పలు దేశాల ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. అయితే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం చర్చల్లో తక్షణ పురోగతి కనిపించడం లేదన్నారు. ఇరాన్ డిమాండ్లు ఆమోదయోగ్యం కానివిగా అభివర్ణించారు.

అమెరికా దాడులతో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ దేశం వద్ద కేవలం 10 శాతం క్షిపణి సామర్థ్యం, 15 శాతం డ్రోన్ల సామర్థ్యం మాత్రమే మిగిలాయని అన్నారు. ఆయుధ తయారీ కేంద్రాలు కూడా చాలావరకు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇరాన్ ఒప్పందానికి ఆసక్తిగా ఉందని, అందువల్ల మరోసారి యుద్ధం వచ్చే అవకాశం తక్కువేనని ట్రంప్ అభిప్రాయపడ్డారు.