అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు మద్దతుగా నిలిచారు. విదేశీ నిఘా సంస్థలతో సంబంధం ఉన్న మహిళతో ఆయనకు సంబంధాలున్నాయన్న ఆరోపణలపై హువాంగ్ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ  నేపథ్యంలో ట్రంప్ స్పందనకు ప్రాధాన్యం ఏర్పడింది. హువాంగ్‌ ఒక మంచి వ్యక్తి అని ప్రశంసించారు. అయితే ఈ ఆరోపణల గురించి హువాంగ్‌తో తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు.

ఆదివారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. వచ్చే వారం ఆసియా పర్యటనకు హువాంగ్‌ను కూడా తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఆయన వస్తారో? లేదో? తనకు తెలియదన్నారు. హువాంగ్‌ను గౌరవప్రదమైన వ్యక్తిగా అభివర్ణించారు. అమెరికా కోసం ఆయన అద్భుతమైన సేవలు అందించారని కొనియాడారు.

స్వతంత్ర విచారణకు ఎన్విడియా ఆదేశం
హువాంగ్‌కు చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో సంబంధాలున్నాయన్న కథనాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె బీజింగ్‌ తరఫున పనిచేస్తున్నారనే అనుమానాలు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం ఉంది. ఈ వ్యవహారంపై ఎన్విడియా స్వతంత్ర విచారణకు ఆదేశించింది. కంపెనీ స్వతంత్ర డైరెక్టర్ల కమిటీ పర్యవేక్షణలో బాహ్య న్యాయ నిపుణుల సహకారంతో దర్యాప్తు జరగనుంది.

అమెరికా జాతీయ భద్రతకు లేదా కంపెనీ రహస్యాలకు ముప్పు వాటిల్లినట్లు తమకు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్విడియా బోర్డు తెలిపింది. అయినప్పటికీ అన్ని అంశాలను పరిశీలించనున్నట్లు వెల్లడించింది. విచారణకు సహకరించేందుకు హువాంగ్ కూడా అంగీకరించారు.

చిప్స్‌ వ్యవహారంలోనూ అనుమానాలు
ఆలిస్ హువాంగ్ గతంలో సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ సంస్థ ఎన్విడియా ఏఐ చిప్స్‌ను కొనుగోలు చేస్తుంది. అమెరికా ఎగుమతి ఆంక్షలు ఉన్నప్పటికీ చైనాకు అధునాతన చిప్స్ చేరవేసేందుకు ఈ సంస్థ సహకరించిందన్న అనుమానాలపై అమెరికా అధికారులు పరిశీలిస్తున్నారు.

భార్యకు క్షమాపణలు చెప్పిన హువాంగ్
మరోవైపు భార్యకు నమ్మకద్రోహం చేసిన విషయాన్ని హువాంగ్ ఉద్యోగుల వద్ద అంగీకరించారు. తన చర్యల వల్ల భార్య, పిల్లలు బాధపడ్డారని విచారం వ్యక్తం చేశారు. తన తప్పుకు ఎలాంటి సమర్థన లేదని, హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. 1985లో లోరీ మిల్స్‌ను వివాహం చేసుకున్న హువాంగ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు కూడా ఎన్విడియాలో పనిచేస్తున్నారు. ఉద్యోగులు, డైరెక్టర్లు, భాగస్వాములు, వాటాదారుల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.