వెండితెరపై కథానాయికగా కనిపించాలనే ఆశతో ఎంతోమంది ఇండస్ట్రీకి వస్తుంటారు. అలాంటివారిలో కొంతమందికి మాత్రమే అవకాశాలు దక్కుతూ ఉంటాయి. వాళ్లలో అతి తక్కువమందికి మాత్రమే హిట్స్ పడుతూ ఉంటాయి .. స్టార్ డమ్ దక్కుతూ ఉంటుంది. అలాంటి కథానాయికల జాబితాలో కాజల్ అగర్వాల్ ఒకరుగా కనిపిస్తుంది. తెలుగులో 'చందమామ' హిట్ తరువాత కాజల్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తరువాత ఆమె తెలుగు .. తమిళ .. హిందీ భాషలలో క్రేజ్ ను సంపాదించుకుంది.

వివాహమైన తరువాత కూడా కాజల్ తన కెరియర్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తోంది. అలా రీసెంటుగా ఆమె చేసిన సినిమాగా 'రామాయణం' కనిపిస్తుంది. శ్రీరాముడిగా రణ్ బీర్ కపూర్ .. రావణుడిగా యశ్ నటించిన ఈ సినిమాలో కాజల్ 'మండోదరి' పాత్రలో కనిపించింది. రావణుడి భార్య మండోదరి మహా సౌందర్యవతి అని అంటారు. ఆ మాటకు కాజల్ న్యాయం చేకూర్చింది. నిజంగానే ఈ సినిమాలో ఆమె ఆ పాత్రలో చాలా అందంగా కనిపించింది. కానీ నటనకి అవకాశం లేకుండా పోవడమే ఆమె అభిమానులను నిరాశపరిచింది. 

రావణుడి భార్య 'మండోదరి' పాత్ర చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. మండోదరి ప్రమేయం సెకండ్ పార్టులో ఎక్కువగా ఉంటే ఉండొచ్చు. కానీ ఫస్టు పార్టులో కూడా ఆమె పాత్రను కాస్త బలంగా చూపించవలసిందనే టాక్ వినిపిస్తోంది. ఆమెను నామమాత్రంగా చూపించడం పట్లనే అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాజల్ మాత్రం .. తన పాత్ర నిడివి కంటే, ఇంతటి గొప్ప ప్రాజెక్టులో చేసే అవకాశం రావడమే అదృష్టమని అంటోంది. మరి సెకండ్ పార్ట్ అయినా ఆమె అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుందేమో చూడాలి.