తమిళంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేయాలంటే సూర్య చేయవలసిందే అనే ఒక టాక్ ఉంది. అందుకు కారణం ఆ పాత్రలలో ఆయన అంతగా జీవించడమే .. అంతగా రాణించడమే. అలాంటి సూర్య మరోసారి అదే తరహా పాత్రలో రీసెంటుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా పేరే 'సీన్'. జిత్తూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నజ్రియా నజీమ్ ఈ సినిమాలో ఆయన సరసన నటించింది.

సాధారణంగా ఒక క్రిమినల్ ను పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగితే, ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయా అని ప్రేక్షకులు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అదే ఆ పోలీస్ ఆఫీసర్ కి కంటిచూపు లేకపోతే, ఆ టెన్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎలా ఆ క్రిమినల్ ను పట్టుకుంటాడా అనే ఒక కుతూహలం అంచెలంచెలుగా పెరుగుతూ పోతుంది. ఈ అంశమే ఈ సినిమాలో ప్రేక్షకులను కూర్చోబెడుతుంది. హీరో ఏం చేయాలనే ఒక సీన్ చూపించేది హీరోయిన్ కావడం ఇక్కడి విశేషం. 

అయితే ఈ కథలో హీరో .. హీరోయిన్ .. క్రిమినల్ .. ఈ మూడు పాత్రలే చాలా బలంగా కనిపిస్తాయి. మిగతా పాత్రలు చాలా బలహీనంగా ఉండటం ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. హీరో తల్లిదండ్రుల పాత్రలు .. హీరోయిన్ తండ్రి పాత్ర ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా చాలా చిరాకుపెడతాయి.ఇక మిగతా పోలీస్ అధికారుల పాత్రలు కూడా నామమాత్రంగానే కనిపిస్తాయి. సపోర్టింగ్ రోల్స్ ను కూడా సరిగ్గా డిజైన్ చేసుకుని ఉంటే, 'సీన్' దెబ్బతినేది కాదేమో .. ఈ కంటెంట్ హిట్ దిశగా పరిగెత్తేదేమో అనిపిస్తుంది.