ముంబై విమానాశ్రయంలో ఎదురైన చేదు అనుభవంపై ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ అసహనం వ్యక్తం చేశాడు. టెర్మినల్ 2లో ప్రీమియం 'ప్రణామ్ సర్వీసెస్' అందించిన సేవలు అత్యంత దారుణంగా ఉన్నాయంటూ ఆయన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో విమర్శలు గుప్పించాడు. భారీగా రుసుము చెల్లించి పొందే ఈ సేవల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా, అహంకారంతో వ్యవహరించారని ఆయన ఆరోపించాడు.

తాను విమానాశ్రయానికి చేరుకునే సమయానికి సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరని అద్నాన్ సమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విమానం ఐదు గంటలు ఆలస్యమవుతుందనే విషయం తెలిసినప్పటికీ, తాము సెక్యూరిటీ క్లియరెన్స్ పూర్తి చేసుకుని లోపలికి వెళ్ళాక ఆ సమాచారం ఇచ్చారని, దీంతో గంటల తరబడి విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపాడు. తమకు కేటాయించిన మహిళా సిబ్బంది నిరంతరం ఫోన్‌లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కనీసం గేట్ వరకు కూడా తోడు రాలేదని ఆరోపించాడు.

ఈ ఘటనపై ముంబై ఎయిర్‌పోర్ట్ అధికారిక ఖాతా స్పందిస్తూ క్షమాపణలు కోరింది. అయితే, ఈ స్పందనపై అద్నాన్ సమీ మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. అది కేవలం ఒక 'బాట్' పంపిన ముందస్తు సమాధానంలా ఉందని, తనను మొదటి పేరుతో సంబోధించడం పట్ల ఆయన అభ్యంతరం తెలిపాడు. "కుచ్ తమీజ్ ఔర్ తెహజీబ్ సీఖియే.. హద్ హై!!" (కొంచెం మర్యాద, పద్ధతి నేర్చుకోండి.. హద్దు మీరుతున్నారు!!) అంటూ హిందీలో ఘాటుగా బదులిచ్చాడు. ప్రణామ్ సర్వీసెస్‌పై తాను ఫిర్యాదు చేయడం ఇది రెండోసారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నాడు.