కోలీవుడ్ హీరోలలో హరీష్ కళ్యాణ్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు అందుకు కారణమని చెప్పాలి. ఆయన కథానాయకుడిగా రూపొందిన ఒక సినిమా ఇప్పుడు 'జీ 5'లో నేరుగా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఆ సినిమా పేరే 'నూరుకోడి వానవిల్'. రొమాంటిక్ డ్రామా జోనర్ కి సంబంధించిన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా, నేరుగా 'జీ 5'లోనే విడుదల చేయబడింది. ఈ నెల 6వ తేదీ నుంచి ఆడియన్స్ కి అందుబాటులోకి వచ్చింది. 

కథలోకి వెళితే .. వినోద్ ముంబైలోని ఒక టీవీ ఛానల్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని ప్రోగ్రామ్స్ మంచి టీఆర్పీతో రన్ అవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలోనే అతనిని ఒక కొత్త ప్రోగ్రామ్ నిమిత్తం 'గోవా' పంపిస్తారు. తాను డిజైన్ చేసిన కాన్సెప్ట్ తోనే అతను గోవా చేరుకుంటాడు. సిటీలోకి అడుగుపెడుతూ ఉండగానే ఒక అమ్మాయి అతనికి తారసపడుతుంది. ఆ అమ్మాయి పేరే 'ఫెన్నీ'. ఆమె గ్లామర్ .. చురుకుదనం అతనిని కట్టిపడేస్తాయి. దాంతో ఆమెను తన ప్రోగ్రామ్ కి యాంకర్ పెట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. 

ఫెన్నీ వెంటపడుతూ .. ఆమెతో పరిచయం పెంచుకుంటాడు వినోద్. అయితే యాంకర్ గా చేయడానికి ఆమె 'నో' చెబుతుంది. ఆమె అలా చెప్పడానికి కారకుడు ఆమె బాయ్ ఫ్రెండ్ అనీ, ప్రస్తుతం అతను హాస్పిటల్లో కోమాలో ఉన్నాడని అతనికి తెలుస్తుంది. అతను కోమాలో నుంచి బయటపడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమనే సంగతి అతనికి అర్థమవుతుంది. అప్పుడు వినోద్ ఏం చేస్తాడు? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది కథ. ప్రేమ చుట్టూ తిరిగే ఈ కథ యూత్ కి నచ్చే అవకాశాలు ఉన్నాయి.