లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సవాల్‌ విసురుతుంటే.. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్‌కు పార్లమెంటులో మరిన్ని స్థానాలు కావాలంటే రాహుల్‌గాంధీ ఏడు విషయాల్లో మార్పులు చేసుకోవాలని సూచించారు. తరచూ రహస్యంగా విదేశీ పర్యటనలకు వెళ్లడం మానుకోవాలని, సీనియర్లను గౌరవించాలని హితవు పలికారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

రాహుల్‌గాంధీ తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లకుండా భారత్‌లో ఎక్కువ సమయం గడపాలని రిజిజు సూచించారు. సీనియర్‌ నేతలను గౌరవిస్తూ వారి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తులను కలవకూడదని, వారి ఎజెండాను ప్రోత్సహించకూడదని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, ప్రధాని మోదీపై వ్యతిరేకత తగ్గించుకోవాలని సూచించారు. బీజేపీని రాజకీయ ప్రత్యర్థిగా చూడాలే తప్ప శత్రువుగా భావించకూడదన్నారు.

పార్లమెంటు కార్యకలాపాలను మరింత సీరియస్‌గా తీసుకోవాలని, కాంగ్రెస్‌ ఎంపీలకు చర్చల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను గౌరవించాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని, కుటుంబ రాజకీయాలకు ముగింపు పలకాలని ఏడో సూచనగా పేర్కొన్నారు.

అంతకుముందు పార్లమెంటులో విపక్ష సభ్యులు వాకౌట్‌ చేసిన పాత వీడియోను రిజిజు ఎక్స్‌లో పంచుకున్నారు. చర్చలు, వాదోపవాదాల కోసమే పార్లమెంటు ఉందని పేర్కొన్నారు. చర్చల్లో పాల్గొనడానికి ఇష్టపడనివారే ఇప్పుడు బహిరంగ చర్చ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ రాహుల్‌గాంధీ బుధవారం మరోసారి సవాల్‌ విసిరారు. ఐదు నిమిషాల్లోనే ప్రధాని దేశద్రోహి అని నిరూపిస్తానంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్రంగా స్పందించారు. అంతకుముందు కూడా ప్రతిపక్షాన్ని దేశ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరిస్తున్నారంటూ మోదీపై రాహుల్‌ విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.