ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) చేపట్టిన కాలుష్య రహిత దీపావళి ప్రచారంలో పాల్గొన్న బాలీవుడ్‌ నటి దియా మీర్జాపై బీజేపీ, శివసేన నేతలు విమర్శలు గుప్పించారు. దేశ ప్రజలకు దీపావళి ఎలా జరుపుకోవాలో తెలుసని, కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ వివాదం నేపథ్యంలో దియా మీర్జా పాల్గొన్న వీడియోను బీఎంసీ తన సామాజిక మాధ్యమ ఖాతాల నుంచి తొలగించింది.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, బాణసంచా కాల్చకుండా పర్యావరణహితంగా దీపావళి జరుపుకోవాలని బీఎంసీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. బాంబే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రచారాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా దియా మీర్జాతో పాటు మాధురీ దీక్షిత్‌, క్రికెటర్‌ అజింక్య రహానె వంటి ప్రముఖులతో అవగాహన వీడియోలు రూపొందించింది. అయితే ఈ ప్రచారంలో దియా మీర్జాను చేర్చడంపై ముంబై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ సతమ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీపావళి ఎలా జరుపుకోవాలో బయటి వ్యక్తులు వచ్చి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనిపై వివాదం మొదలవడంతో బీఎంసీ ఆమె వీడియోను తొలగించింది.

కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే మాట్లాడుతూ.. దియా మీర్జా ముస్లిం సమాజానికి చెందినవారైనప్పటికీ ఈ అంశాన్ని మతపరమైన కోణంలో చూడకూడదన్నారు. భారత రాజ్యాంగం ప్రతి మతానికీ తమ పండుగలను జరుపుకునే హక్కు కల్పించిందని చెప్పారు. ముస్లింలు ఈద్‌, రంజాన్‌ జరుపుకొన్నప్పుడు ఇతర మతాలవారు గౌరవించినట్లే.. హిందువుల దీపావళినీ గౌరవించాలని అన్నారు. అయితే బాణసంచా కాల్చకపోతే పండుగలో కొంత ప్రత్యేకత తగ్గుతుందని, అదే సమయంలో అధిక కాలుష్యంపై కూడా ఆందోళన అవసరమని వ్యాఖ్యానించారు.

బీజేపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ భారతీయ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు దీపావళి ఎలా జరుపుకోవాలో తెలుసని, పర్యావరణ పరిరక్షణపై హిందూ సమాజానికి శతాబ్దాలుగా అవగాహన ఉందని పేర్కొన్నారు. మరోవైపు శివసేన జాతీయ అధికార ప్రతినిధి షైనా ఎన్‌సీ మాట్లాడుతూ.. కాలుష్యాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ప్రజల జీవితం, ఆరోగ్యం ముఖ్యమని, బాణసంచా విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.