వరుస ఎన్నికల ఓటములతో కాంగ్రెస్‌ పార్టీ నైరాశ్యంలో కూరుకుపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి రావడం సాధ్యం కాకపోవడంతో అరాచక మార్గాల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ కుట్రపూరిత ప్రయత్నాల నుంచి దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఆయన పోస్టు చేశారు.

హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘లోక్‌తంత్ర బచావో - అరాచకత హటావో’ (ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం) మహా పాదయాత్రలో తాను పాల్గొంటున్నట్లు అమిత్‌ షా వెల్లడించారు. కాంగ్రెస్‌ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ పాదయాత్రలో అమిత్‌ షాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, తెలంగాణ బీజేపీ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత నిర్వహించనున్న బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీపై ఆయన మరిన్ని విమర్శలు చేసే అవకాశం ఉండటంతో సభలో ఆయన ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.