దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ విలువలను అనుసరిస్తూ వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువత ఉత్సాహంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని, సమాజంలో సౌభ్రాతృత్వంతో మెలగాలని సూచించారు. దేశంలో, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

దీపావళి పండుగకు సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. రావణుడిపై విజయం సాధించిన అనంతరం శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని గుర్తుచేశారు. ఈ వేడుక రామరాజ్య శుభారంభానికి ప్రతీకగా నిలిచిందన్నారు. చెడు లక్షణాలపై సద్గుణాల విజయం, కష్టాల నుంచి విముక్తి పొంది సుఖసంతోషాలతో కూడిన జీవితం ప్రారంభం కావడాన్ని దీపావళి సూచిస్తుందని తెలిపారు. శుభారంభాల కోసం గణేశుడిని, సంపద, శ్రేయస్సు కోసం మహాలక్ష్మిని పూజిస్తూ అందరి సంతోషం కోసం ప్రార్థిస్తారని వివరించారు. దేశ ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ చీకటిపై వెలుగుల విజయానికి, చీకటిని పారదోలాలన్న సంకల్పానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, శ్రేయస్సు నిండాలని ఆకాంక్షించారు. ఏటా ఉత్సాహంగా దీపావళి జరుపుకుంటానని, ఈసారి కూడా సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్న వీర జవాన్లతో కలిసి పండుగ చేసుకోనున్నట్లు వెల్లడించారు.

అంతకుముందు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను మోదీ కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఉపరాష్ట్రపతి అయోధ్యలో నిర్వహించే దీపోత్సవం-2026లో పాల్గొనేందుకు శనివారం అక్కడికి చేరుకున్నారు. శ్రీరామ జన్మభూమి ఆలయంలో పూజలు చేయడంతో పాటు శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ ఏడాది దీపోత్సవం పదో వార్షికోత్సవం కావడం విశేషం. అయోధ్యలోని 56 ఘాట్లలో 30 నుంచి 33 లక్షల మట్టి దీపాలు వెలిగించాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.