2027 ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకుని భారత క్రికెట్ జట్టులో చోటు కోసం పేస్ బౌలర్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల యువ పేసర్ గుర్నూర్ బ్రార్ కెరీర్‌కు గొప్ప మలుపునిచ్చేలా కనిపిస్తోంది. 

ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచుల్లో తన అద్భుతమైన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన బ్రార్, మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా రెండో వన్డేలో కేవలం 30 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు కేవలం 11 వన్డేలు ఆడిన గూనూర్, 21 వికెట్లతో జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో లేనప్పుడు నమ్మదగిన బౌలర్‌గా ఎదుగుతున్నాడు.

రెండో వన్డేలో గుర్నూర్ బ్రార్ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు గుర్నూర్ బౌలింగ్ శైలి ఎందుకు నచ్చుతుందో కార్తీక్ వివరించాడు. 'క్రిక్‌బజ్‌'తో మాట్లాడుతూ.. "గుర్నూర్ బ్రార్ నుంచి ఆ దూకుడు చూడటం చాలా బాగుంది. మనకు అలాంటి బౌలరే కావాలి. గంభీర్‌కు అతను నచ్చడానికి ఇది కూడా ఒక కారణం. అతను హెవీ బాల్ (బంతిని బలంగా సంధించడం) వేస్తాడు. బ్యాటర్ల పక్కటెముకలను లక్ష్యంగా చేసుకుని బంతులు సంధిస్తాడు. ఈ రోజు ఎంతమంది బ్యాటర్లను అతను దెబ్బతీశాడో మనం చూశాం" అని కార్తీక్ అన్నాడు.

ప్రస్తుతం జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌లో ఆడకపోవడం, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ వంటి అనుభవజ్ఞులు బెంచ్‌కే పరిమితం కావడంతో గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్‌లు కివీస్ గడ్డపై భారత పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా వంటి వారు కూడా జట్టులో లేకపోవడం గుర్నూర్‌కు కలిసి వచ్చింది.

గుర్నూర్ బ్రార్ తో పాటు అకిబ్ నబీ వంటి యువ బౌలర్లకు న్యూజిలాండ్‌లోని బౌలింగ్ అనుకూల పరిస్థితులు ఎంతో మేలు చేస్తున్నాయని కార్తీక్ అభిప్రాయపడ్డాడు. "కొన్నిసార్లు బౌలర్ల పరిస్థితి చూస్తే జాలి వేస్తుంది. కానీ, ఇక్కడ వారికి అనుకూలమైన పరిస్థితులు లభించడం మంచి విషయం" అని అన్నాడు. 

ఇదే సిరీస్‌లో అకిబ్ నబీ కూడా తన తొలి రెండు వన్డే వికెట్లను సాధించడం విశేషం. మొత్తం మీద గుర్నూర్ బ్రార్ నిలకడైన ప్రదర్శన భారత పేస్ బౌలింగ్ భవిష్యత్‌కు బలమైన సంకేతాలు పంపుతోంది.