భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో మరోసారి అసహనానికి గురయ్యాడు. న్యూజిలాండ్‌తో నిన్న‌ వెల్లింగ్‌టన్‌లో జరిగిన రెండో వన్డే సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లీ సమీపంలోకి ఓ అభిమాని చిన్న ప్లాస్టిక్ బ్యాట్‌ను విసిరాడు. తన ఆటోగ్రాఫ్ కోసమే ఆ అభిమాని అలా చేసి ఉంటాడని భావిస్తున్నారు.

అయితే, అభిమాని ప్రవర్తనకు కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలోకి వస్తువులు విసరడం సరికాదన్నట్లుగా సైగలు చేస్తూ, ఆ బ్యాట్‌ను చేతిలోకి తీసుకుని తిరిగి ప్రేక్షకుల వైపు విసిరేశాడు. ఇలాంటి పనులు చేయవద్దని ప్రేక్షకులకు సూచించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా అంతరాయం కలిగిన ఈ లో-స్కోరింగ్ మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. యువ ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణించి కివీస్‌ను కట్టడి చేయగా, లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడినప్పటికీ రోహిత్ శర్మ (23), శ్రేయస్ అయ్యర్ (30), కేఎల్ రాహుల్ (26 నాటౌట్) పోరాడారు. అయితే, చివ‌ర‌లో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 

భారత్ స్కోరు.. 26 ఓవర్లలో 113/7 వద్ద ఉండగా.. మ‌ళ్లీ వర్షం మొదలైంది. ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం అంపైర్లు భారత్ 4 పరుగుల తేడాతో గెలిచినట్లు ప్రకటించారు. ఈ విజయంతో టీమిండియా 5 మ్యాచుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే మంగళవారం హామిల్టన్‌లో జరగనుంది.