జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్‌కు చెందిన హెల్త్-టెక్ ఏఐ వేరబుల్ గాడ్జెట్ 'టెంపుల్' (Temple) చుట్టూ నెలకొన్న వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రముఖ హెపటాలజిస్ట్ డాక్టర్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ (సోషల్ మీడియాలో 'ది లివర్ డాక్'గా సుపరిచితులు) ప్రముఖ పాడ్‌కాస్టర్ రణ్‌వీర్ అల్లాబాదియా (బీర్‌బైసెప్స్) తీరును తీవ్రంగా ఆక్షేపించారు. 'టెంపుల్' ప్రాజెక్టులో రణ్‌వీర్‌కు ఉన్న ఆర్థిక ప్రయోజనాలను బహిరంగంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా రణ్‌వీర్ పెట్టిన పోస్ట్‌పై ది లివర్ డాక్ స్పందించారు. "హలో రణ్‌వీర్, ఒక ఉత్పత్తిని సమర్థించే ముందు అందులో మీకు ఉన్న వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాలను వెల్లడించడం ఎంతో సమంజసం, నైతిక బాధ్యత కూడా" అని పేర్కొన్నారు. దీపిందర్ గోయల్ స్థాపించిన ఈ హెల్త్-టెక్, ఏఐ వేరబుల్ సంస్థలో రణ్‌వీర్ అల్లాబాదియా ఏంజెల్ ఇన్వెస్టర్‌గా ఉన్నారని ఆయన వెల్లడించారు. అధికారిక నివేదికల్లో రణ్‌వీర్ వాటా శాతం ఎంతనేది స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ, టెంపుల్ సంస్థ సేకరించిన 54 మిలియన్ డాలర్ల భారీ సీడ్ ఫండింగ్ రౌండ్‌లో ఆయన ఒక ముఖ్యమైన ఏంజెల్ ఇన్వెస్టర్‌గా పాల్గొన్నారని లివర్ డాక్ తెలిపారు.

టెంపుల్ వేరబుల్ పరికరం యొక్క శాస్త్రీయ విశ్వసనీయతపై వైద్య వర్గాలు, నిపుణుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో రణ్‌వీర్ దానికి బాహాటంగా మద్దతు పలికారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి (R&D) వివరాలు పూర్తిగా తెలియకుండానే సాంకేతికతను శాస్త్రీయత లేనిదిగా ముద్రవేయడం సరికాదని ఆయన వాదించారు. ప్రస్తుత దశలో గోయల్ ప్రాజెక్ట్‌ను కొట్టిపారేయడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. అయితే, సంస్థలో వాటాదారుగా ఉంటూ, ఆ విషయాన్ని ప్రస్తావించకుండా ఉత్పత్తిని సమర్థించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇంక్42 (Inc42) మీడియా నివేదిక ప్రకారం.. టెంపుల్ సంస్థలో దీపిందర్ గోయల్ అత్యధికంగా 28.59 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. సంస్థాగత పెట్టుబడిదారులలో స్టెడ్‌వ్యూ క్యాపిటల్ 5.28 శాతం, పీక్ XV పార్టనర్స్ 3.17 శాతం, ధారణ ఫండ్ 2.9 శాతం, క్యూఎల్‌టీ టెక్నాలజీ 2.11 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. వీరితో పాటు అక్షాంత్ గోయల్, విజయ్ శేఖర్ శర్మ, వరుణ్ అలగ్, అభిరాజ్ సింగ్ భాల్, కునాల్ షా, రాజ్ షమానీ వంటి భారత స్టార్టప్ దిగ్గజాలు కూడా ఈ సంస్థలో వాటాదారులుగా ఉన్నారు. కంపెనీ ఈక్విటీలో ఎంప్లాయ్ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్స్ (ESOP) వాటా 10 శాతంగా ఉండగా, ఇతర వాటాదారుల వద్ద 38.06 శాతం వాటా ఉంది