ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార టీడీపీ అరాచకాలకు పాల్పడిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మహిళలపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, అసలు వీటిని ఎన్నికలంటారా? అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు బజారు రౌడీలా ప్రవర్తిస్తున్నారని రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. "చంద్రబాబు మాటలకు, ఆచరణకు సంబంధం ఉండదు. ఆయన మేక తోలు కప్పుకున్న తోడేలు" అని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని, ఎన్నికల్లో అంతులేని దుర్మార్గాలకు తెరలేపారని ఆరోపించారు. మీడియాపై కూడా దాడులు చేశారని, సీఎంగా కొనసాగే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు.

మరోవైపు, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ... ఎన్నికల్లో హింస జరుగుతున్నా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పడాన్ని తప్పుబట్టారు. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడైనా ప్రజాస్వామ్యం కనిపించిందా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ దాడులను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన వైసీపీ కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.